మద్యం స్కాం విషయమై త్వరలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి నోటీసులిచ్చే ఛాన్స్..
మద్యం స్కాం లింకులు మాజీ సీఎం మెడకు చుట్టుకోవడం ఖాయమంటూ చర్చ.
ఏపీలో మద్యం స్కాం లింకులు అటు తిరిగి.. ఇటు తిరిగి మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చేరనున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. మర్రి చెట్టు ఊడలు భూమి లోపల చాలా దూరం వరకు విస్తరించినట్టుగా.. ఏపీలోని మద్యం కుంభంకోణం లింకులు కూడా అండర్ గ్రౌండులో చాలా దూరం విస్తరించాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్సులో విస్తృతంగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతానికైతే మద్యం స్కాంతో లింకులున్నాయని నాటి ప్రభుత్వంలోని కొందరు పెద్దలను విచారణకు పిలిచారు. ఎంపీ మిధున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, బెవరెజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి వంటి వారితో పాటు.. నాడు బెవరెజెస్ కార్పోరేషనులో కీలకంగా వ్యవహరించిన సత్యకుమార్ వంటి వారిని విచారణకు పిలిచారు. వీరే కాకుండా.. తాడేపల్లి ప్యాలెస్సుతో లింకులున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇదే తరహాలో ఇంకొన్ని అరెస్టులు జరిగాయి. ఈ క్రమంలో మద్యం స్కాం లింకులు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వరకు వెళ్లే సూచనలైతే స్పష్టంగా కన్పిస్తున్నాయి. ఈ తరహా సూచనలు కన్పించడానికి కారణం లేకపోలేదనేది పొలిటికల్ సర్కిల్సులో వినిపిస్తున్న వాదన. ఆ కారణం మరేదో
కాదు.. విజయసాయిరెడ్డి.. ఆయనిచ్చిన వాంగ్మూలమేననేది ఇప్పుడు లేటెస్టుగా జరుగుతున్న చర్చ.
విజయసాయి రెడ్డి విచారణలో భాగంగా కొన్ని కీలకాంశాలు ప్రస్తావించారు. మద్యం స్కాం ఎలా జరిగిందనే విషయాలను చెప్పకనే చెప్పేశారు. ఈ విషయాన్ని వారో వీరో కాదు.. స్వయంగా విజయసాయి రెడ్డే మీడియా కాన్ఫరెన్సులో కొన్ని విషయాలను ప్రత్యక్షంగా.. ఇంకొన్ని విషయాలను పరోక్షంగా ప్రస్తావించేశారు. గత ప్రభుత్వం హయాంలో మద్యం పాలసీ డిసైడ్ చేసే క్రమంలో తన నివాసంలో ఎవరెవరు సమావేశమైంది వివరించేశారు సాయిరెడ్డి. ఈ వైసీపీ మాజీ ఎంపీ చెప్పిన దాని ప్రకారం.. ఆ సమావేశంలో తనతో పాటు.. సజ్జల రామకృష్ణా రెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బెవరెజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, బెవరెజెస్ కార్పోరేషనులో ఉన్నతోద్యోగి సత్యకుమార్ పాల్గొన్నారు. ఇక్కడే అసలు కిటుకు ఉందని అంటున్నారు. మద్యం పాలసీ డిసైడ్ చేయాల్సింది.. అయితే సెక్రటేరీయేట్టులో.. లేదా మంత్రి ఛాంబరులో.. అదీ లేదంటే బెవరెజెస్ కార్పోరేషన్ ఎండీ ఆఫీసులో.. ఇక తప్పదనుకుంటే సదురు మంత్రి అధికారిక నివాసంలో సదరు కీలక సమావేశం జరగాలి. అలాంటింది ఆ మీటింగ్ విజయసాయి రెడ్డి సమక్షంలో జరిగిందంటే.. అందులోనూ ప్రైవేట్ వ్యక్తులు ఆ సమావేశంలో పాల్గొన్నారంటేనే స్కాంకు బీజాలు అక్కడే పడ్డాయనే విషయాన్ని విజయసాయి రెడ్డి చెప్పేసినట్టేనంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా నాటి సీఎంకు అత్యంత సన్నిహితులుగా ఉన్నవారే.
ఇదీ కాకుండా.. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో సహా.. ఇంకొందరు నిందితులు ఇచ్చిన వివరాలు బట్టి.. మద్యం స్కాం సొమ్ము.. నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత సహయకుడు కృష్ణమోహన్ రెడ్డికి వెళ్లాయి.. ఈ వ్యవహరమంతా నాటి సీఎంఓలో కీలకంగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ప్రస్తుతం ఈ మద్యం స్కాంను విచారిస్తున్న సిట్ కు సమాచారం అందింది. ఇవన్నీ చూస్తుంటే.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి త్వరలోనే నోటీసులు అందడం ఖాయమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీ లిక్కర్ స్కాం.. జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టుకోవడం ఖాయమనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది. దీంతో లిక్కర్ కిక్ ఎంత వరకు ఉంటుందో కానీ.. మద్యం స్కాంలో వెలుగులోకి వచ్చిన విషయాలతో పొలిటికల్ కిక్ మాత్రం మహ రంజుగా ఉండబోతోందని అంచనా వేస్తున్నారు.