ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని బిక్కు బిక్కుమంటున్న ప్రభుత్వాలు..
దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలు ప్రభుత్వాలకు నేర్పుతోందేంటీ..?
అమరావతి
పండుగలు.. పర్వదినాలు రాష్ట్ర ప్రభత్వాలకు సవాల్ గా మారుతున్నాయి. పండుగలు.. పర్వదినాలు వచ్చాయంటే చాలా మంది ప్రజలు.. దేవుణ్ని దర్శించుకునేందుకు.. ఆయా రోజుల్లోని విశిష్టతల ఆధారంగా ఆయా ఆలయాలను సందర్శించడం అనేది ఆనవాయితీగా మారింది. గతంతో పోల్చుకుంటే భక్తి టూరిజం కూడా విపరీతంగా పెరిగింది. టెంపుల్ టూరిజం అంటే గతంలో వయోవృద్ధులు.. మహిళలు ఎక్కువగ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. హిందూ ధర్మం మీద చాలా మంది రాన్రాను నమ్మకం పెరుగుతోంది. పర్వదినాల్లో తప్పకుండా దైవ దర్శనం చేసుకోవడం.. అది కూడా ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్లి దర్శించుకోవాలనే విధానం పట్ల యువత కూడా ఆకర్షితులవుతున్నారు. దీంతో పుణ్య తిథుల్లో పండుగల సందర్భంలో దేవాలయాలన్ని కిటకిటలాడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో దేవాలయాల్లో ఏర్పాట్లు సరిగా చేయడంతోపాటు.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగనీయకుండా చూసుకోవడం ప్రభుత్వాలకు అతి పెద్ద సవాలుగా మారింది. పెద్ద ఎత్తున జనం తరలిరావడం వల్ల వాళ్లని కంట్రోల్ చేయడం ప్రభుత్వానికి.. అధికారులకు కష్టతరంగా మారింది. మారుతున్న పరిస్ధితులు.. ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రభుత్వం లేదా దేవదాయ శాఖ పక్కా ఏర్పాట్లు చేయడమనేది ప్రభుత్వ ప్రధాన విధి. కానీ
పుణ్యక్షేత్రాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఆ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అనే తేడా లేకుండా అన్ని ప్రభుత్వాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంతగా తీసుకోవడం లేదనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. ప్రమాదం జరిగే అవకాశాలను ముందుగా అంచనా వేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. అలాగే దేవదాయ శాఖ విపరీతమైన నిర్లక్ష్యం కూడా మరో కారణంగా కన్పిస్తోంది.
ఇటీవల జరిగిన ఘటనల్లో ఇదే అంశం స్పష్టంగా కన్పిస్తోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన, సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనల్లో భక్తులు మృతి చెందడం.. అలాగే గత ప్రభుత్వ హయాంలోనూ జరిగిన వివిధ సంఘటనలు.. ఇక మహకుంభ్ సందర్భంగా జరిగిన ఘటనలు ఇలా చెప్పుకుంటూ ఆ ప్రభుత్వం.. ఈ ప్రభుత్వం అని లేకుండా.. అందరి వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. ప్రజలు టెంపుల్ టూరిజం పట్ల ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో పండుగలు.. పర్వదినాలు.. పుష్కరాల వంటి సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ బ్లూ ప్రింట్ రెడీ చేయాల్సిన అవసరం ఉందనే చెప్పాలి.