23.5 C
Hyderabad
మంగళవారం, జూలై 8, 2025

తన్నీరు లేకుంటే.. బీఆర్ఎస్ పార్టీకి కన్నీరే..

ట్రబుల్ షూటర్... నేటి బీఆర్ఎస్, నిన్నటి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి హరీష్ రావుకు ఉన్న ట్యాగ్ లైన్ ఇది. కేసీఆర్ కు పార్టీలో ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ఆ సంక్షోభాన్ని సమర్ధంగా పరిష్కరించి... పార్టీ ఊపిరి పీల్చుకునేలా చేసే నాయకత్వ సామర్ధ్యం హరీష్ సొంతం. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 2018లో కొడంగల్ లో ఓడించడం వెనుక కూడా హరీష్ మానేజ్ మెంట్ స్కిల్స్ ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. ఐతే... రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ ను కేసీఆర్ సైడ్ ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. హరీష్ రావును కేబినెట్ లోకి తీసుకోలేదు. ఒక్కడినే తీసుకోకపోతే సమస్య వస్తుందన్న ఉద్దేశంతో కేటీఆర్ ను కూడా కొద్ది రోజులు కేబినెట్ కు దూరంగా పెట్టారు. ఆ తర్వాత కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ కేబినెట్ లోకి తీసుకున్నారు. పేరుకు పెత్తనమే తప్ప... హరీష్ మాట చెల్లుబాటు కాకుండా చేశారు. క్రమంగా ఆయన స్థాయిని పార్టీలో తగ్గిస్తున్న సంకేతాలు ఇచ్చారు. 

తర్వాత కాలంలో హరీష్ ను కేవలం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం చేశారు. సిద్ధిపేట – హైదరాబాద్ తప్ప మరో చోటకు హరీష్ వెళ్లలేని పరిస్థితి సృష్టించారు. తీవ్ర ఉక్కపోతకు గురి చేశారు. సహజంగా ఓపికకు బ్రాండ్ అంబాసిడర్ అన్న పేరున్న హరీష్... పంటి బిగువన ఈ ఉక్కపోతను భరించారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సమయానికి పరిస్థితి పరాకాష్ఠకు వెళ్లింది. తండ్రీ కొడుకులు కలిసి హరీష్ ఉనికిని పూర్తిగా ప్రశ్నార్థకం చేశారు. వరంగల్ సభకు ముందు హరీష్ ను ఇన్ ఛార్జ్ అని ప్రకటించారు. తర్వాత ఫాంహౌస్ లో ఏం చర్చలు జరిగాయో తెలియదు. సభా వేదికే మారిపోయింది. వరంగల్ ఎల్కతుర్తి నుండి మేడ్చల్ వద్దకు మారింది. సీన్ లో కేటీఆర్ రంగ ప్రవేశం చేసి మొత్తం కబ్జా పెట్టేశారు. పరిస్థితి మొత్తం కేటీఆర్ నియంత్రణలోకి వచ్చింది అనుకున్న తర్వాత సభ వేదికను మళ్లీ వరంగల్ కు మార్చారు. అక్కడ నుండి హరీష్ బొమ్మను పూర్తిగా చింపేసే దిశగా అడుగులు పడ్డాయి. ఏప్రిల్ 27 ఎల్కతుర్తి సభ నాటికి ఎటు చూసినా కేసీఆర్, కేటీఆర్ తప్ప మరో పేరు, బ్యానర్, జెండా లేకుండా చేశారు. అది రజతోత్సవ సభనా లేక కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించే వేదికనా అన్న స్థాయిలో పరిస్థితి మారిపోయింది. 

మొదటి నుండి పార్టీలో ఉండి... హరీష్ తో కష్టం నష్టం పంచుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఈ పరిణామాలపై లోలోపలే మథన పడిపోయారు. హరీష్ భవిష్యత్ పై ఆందోళనలోకి జారి పోయారు. ఆయనే బాస్ అనుకున్న వాళ్లంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ లో హరీష్ శకం ముగిసిందన్న ఫీల్ వచ్చేసింది. ఆయనను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ పడ్డ శ్రేణులు ప్రత్యామ్నాయాలపై చర్చించడం మొదలు పెట్టాయి. హరీష్ బీజేపీలోకి వెళ్లిపోవాలని కొందరు... లేదు సొంత పార్టీ పెట్టాలని కొందరు విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రబుల్ షూటర్ మాత్రం అదే ఓపికతో, సహనంతో జరుగుతున్న పరిణామాలన్నింటినీ పైకి మౌనంగా చూస్తూ ఉండిపోయారు. 

సీన్ కట్ చేస్తే... బీఆర్ఎస్ పార్టీలో కొత్త సంక్షోభం తెర మీదకు వచ్చింది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాగం వినిపించడం పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతావ్... అని సోది చెప్పే వాళ్లతో చెప్పించుకోవడం, పదేళ్లలో (కేసీఆర్ పాలనలో) సామాజిక తెలంగాణ సాధించలేదని మాట్లాడటం, కేటీఆర్ గొప్పగా చెప్పుకునే తలసరి ఆదాయం విషయంలో కవిత భిన్నమైన లెక్కలు చెప్పడం... దాల్ మే కుచ్ కాలా హై అన్న అనుమానాలను సృష్టించింది. దీనికి కొనసాగింపుగా కవిత కొత్త పార్టీ పెట్టబోతోందన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ కు తన మనోవేధనను వివరిస్తూ లేఖ రాసిందన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. అట్టడుగున ఉన్న పలువురు పార్టీ శ్రేణులను పిలిపించుకుని కవిత చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ తాజా పరిణామాలు బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందన్న సందేహాలకు బలం చేకూర్చాయి. 

సరిగ్గా 15 రోజుల క్రితం హరీష్ అడ్రస్ గల్లంతైందనుకున్న పరిస్థితుల నుండి తాజా పరిణామాలతో మళ్లీ హరీష్ తెర మీదకు వచ్చారు. ట్రబుల్ షూటర్ అన్న పేరుకు తగ్గట్టే ఈ సంక్షోభ సమయంలో మళ్లీ హరీష్ దిక్కయ్యారు. కేటీఆర్ స్వయంగా రెండు రోజులు హరీష్ ఇంటికి వెళ్లి చర్చల జరిపారు. ఏం చెప్పారో, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ, కవిత కలకలం నేపథ్యంలో హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీష్ ను ఉక్కపోతకు గురి చేసిన కేటీఆర్... ఇప్పుడు అదే హరీష్ శరణు కోరుతూ ఆయన ఇంటికి వెళ్లడం హరీష్ రావు సామర్ధ్యాన్ని చెప్పకనే చెప్పింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో... “అంతలోనే ఎంత మార్పు!!” అన్న చర్చ నడుస్తోంది. 

బాటమ్ లైన్..: హరీష్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయాలని భావిస్తే.. ఆ పార్టీ ప్రభావం జీరో అన్నది మరోసారి రుజువైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles