
2047లో తెలంగాణ ఎలా ఉంటుంది!? మీరెవరైనా ఊహించగలరా!! ఈ ప్రశ్న మన మెదళ్లలో తలెత్తగానే ఊహలకు రెక్కలు వస్తాయి. కానీ, ఆ ఊహలను విజన్ డాక్యూమెంట్ గా మార్చింది తెలంగాణలోని రేవంత్ సర్కార్. తెలంగాణ రైజింగ్ -2047 పేరుతో ఓ బృహత్తర మాస్టర్ ప్లాన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధం చేసింది. అందులోని అంశాలు అబ్బురపరిచేలా ఉన్నాయి. నిజంగా తెలంగాణ అలా మారుతుందా! అని ఆశ్చర్య పరిచేలా ఉంది ఆ విజన్.
నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడానికి మే 24న ఢిల్లీ వెళుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్ డాక్యూమెంట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు ఆవిష్కరించబోతున్నారు. వికసిత్ భారత్ పేరుతో 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న విషయం తెలిసిందే. ఐతే, ఆ వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
మోదీని మెప్పించేందుకు, నిధుల కోసం ఒప్పించేందుకు తన విజన్ డాక్యూమెంట్ ను వికసిత్ భారత్ విజన్ డాక్యూమెంట్ తో లింక్ పెట్టి చెప్పినా... రేవంత్ రెడ్డి విజన్ డాక్యూమెంట్ తెలంగాణ రైజింగ్ – 2047 మాత్రం నిజంగా ఒక అద్భుతమే అని చెప్పాలి. ఈ విజన్ డాక్యూమెంట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని మూడు భాగాలుగా విభజించింది.
- 1. కోర్ అర్బన్ తెలంగాణ
- 2. అర్బన్ తెలంగాణ
- 3. రీజినల్ తెలంగాణ
కోర్ అర్బన్ తెలంగాణ అంటే... ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్. ఈ పరిధిలో మెట్రో రెండో దశ... అంటే జూబ్లి బస్ స్టేషన్ - షామీర్ పేట్, జూబ్లీ బస్ స్టేషన్ - మేడ్చల్, ఫలక్ నుమా - ఏయిర్ పోర్టు, ఏయిర్ పోర్టు - ఫోర్త్ సిటీ... పరిధిలో మెట్రో విస్తరణకు డీపీఆర్ లు సిద్ధం చేశారు. ఇక ఇదే కోర్ అర్బన్ ఏరియాలో మూసీ నదిని పునరుజ్జీవింపజేసి హైదరాబాద్ అందాలను, ప్రజల ఆరోగ్యాలను కాపాడే లక్ష్యంతో మరో బృహత్తర పథకాన్ని రేవంత్ సర్కారు ఈ విజన్ డాక్యూమెంట్ లో పొందు పరిచినట్టు సమాచారం. ఇక కోర్ అర్బన్ ఏరియా పరిధిలో కాకపోయినా... ఫోర్త్ సిటీ నిర్మాణం ఈ విజన్ డాక్యూమెంట్ లో కీలక భాగం. నెట్ జీరో (అంటే జీరో పొల్యూషన్) సిటీగా దీనిని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక అర్బన్ తెలంగాణ పరిధిని ఓఆర్ఆర్ నుండి త్రిబుల్ ఆర్ మధ్యలో ఉండేలా ప్లాన్ చేశారు. ఓఆర్ఆర్ – త్రిబుల్ ఆర్ మధ్య రేడియల్ రోడ్లు నిర్మించి... ఈ మొత్తాన్ని ఫార్మా, మాన్యూఫాక్చరింగ్ హబ్ గా డెవలప్ చేయాలని భావిస్తున్నారు. రీజినల్ తెలంగాణ పరిధిలో పూర్తిగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి... అగ్రి బేస్డ్ పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయ పారిశ్రామిక పార్కులు, ప్రాసెసింగ్ యూనిట్లు, అగ్రి ఇండస్ట్రియలైజేషన్ దిశగా అభివృద్ధి చేయడానికి ఈ ప్రణాళికలో పేర్కొన్నట్టు తెలిసింది. దీనికి తోడు యంగ్ ఇండియా పేరుతో యూనివర్సిటీలు, కాలేజీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటుతో మొత్తం తెలంగాణ రూపు రేఖలనే సమూలంగా మార్చి వేసే విధంగా ఈ మాస్టర్ ప్లాన్ ఉంది.
ఈ ప్రణాళికను నీతి అయోగ్ సమావేశంలో సమర్పించి... ఈ లక్ష్యాల సాధనకు కేంద్రం ఆర్థికంగా, అనుమతుల పరంగా సహకరించాలని ముఖ్యమంత్రి కోరబోతున్నారు. నిజం చెప్పాలంటే.. రేవంత్ రెడ్డి ఆలోచనలతో రూపొందిన ఈ విజన్ డాక్యుమెంట్ చాలా బాగుంది. కాకుంటే.. ఈ విజన్ అమలులో ఆర్థికాంశాలు అత్యంత కీలకం. కేంద్రం దీనికి సహకరించడం అంత ఈజీ వ్యవహారం కాదు. రాష్ట్రం ఆదాయంతో ఈ లక్ష్యాలు చేరుకోవడం అసాధ్యం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డు ఏర్పాటు చేసి... దాని ద్వారా ఈ ప్రణాళిక అమలుకు అవసరమైన అన్నీ ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
విజన్ బాగుంది... కానీ, పైసా సంగతే డౌట్.