
2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తర్వాత జరగబోతోన్న మహానాడులో లోకేష్ లీడ్ తీసుకోబోతున్నారా..? కొంత కాలం క్రితం వరకు మహానాడు నిర్వహణలో ఓ భాగంగా మాత్రమే ఉన్న లోకేష్.. ఇప్పుడు అంతా తానై వ్యవహరించబోతున్నారా..? మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో సమూల మార్పులు తెచ్చేందుకు లోకేష్ ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టేశారా..? అంటే టీడీపీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈసారి మహానాడును కేవలం విజయోత్సవ సభగా కాకుండా.. రాబోయే 40 ఏళ్ల పాటు పార్టీ మూలాలను పటిష్టపరిచేందుకు అవసరమైన కీలక విధానాలు తీసుకోబోయే వేదికగా మలిచేందుకు లోకేష్ నడుం బిగించినట్టు తెలుస్తోంది.
మహనాడు జరిగే ప్రతిసారి.. మహానాడులో ఏం చర్చించబోతున్నారనే దాని కంటే.. ఆ మహానాడులో ఏం వంటకాలు వండుతున్నారనే అంశం మీదే ఎక్కువగా ఫోకస్ వస్తుంది. ఏకంగా మెనూ కార్డులు కూడా మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ వచ్చేస్తాయి. ఈసారి మహానాడును కేవలం మెనూ కార్డుకు పరిమితం చేయకుండా.. పార్టీ, రాష్ట్ర భవిష్యత్ కోసం మహనాడులో ఏం కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశంపై ఆలోచనలు రేకెత్తించే దిశగా మహానాడు నిర్వహణ చేపట్టాలని లోకేష్ స్పష్టంగా పార్టీ ముఖ్యులకు చెప్పేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో కడపలో జరగబోయే మహానాడు చాలా సీరియస్సుగా ఉండబోతోందని అంటున్నారు. పార్టీలో ముఖ్యమైన మార్పులకు.. ముఖ్యమైన విధాన నిర్ణయాలకు కడప మహనాడు వేదిక కానుందనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో పార్టీలోని కొందరికి ఇబ్బందైనా సరే.. పార్టీ భవిష్యత్తు కోసం కొన్ని విధాన నిర్ణయాలు తీసుకోకతప్పదని అంటున్నారు. దీంట్లో భాగంగా సీనియర్లల్లో చాలా మందికి చెక్ చెప్పే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. అలాగే మూడు టర్మ్ లు వరుసగా ఒకే పదవిలో ఉంటే వారికి స్థాన చలనం తప్పదని అంటున్నారు. అది డిమోషన్ కావచ్చు.. లేదా ప్రమోషనైనా కావచ్చని అంటున్నారు. స్వయంగా ఈ విధానాన్ని తన విషయంలోనే అమలు చేయాలని కోరడం ద్వారా పార్టీకి అవసరమైన విధానపరమైన మార్పులు తెచ్చే అంశంలో లోకేష్ ఎంత పట్టుదలతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు.
ఇదే సమయంలో ఓ ఆరు అంశాలపై లోకేష్ సీరియస్సుగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి మూల సిద్దాంతం నుంచి స్ఫూర్తి పొంది.. ప్రస్తుతం ప్రజల సమస్యలు.. అవసరాలకు అనుగుణంగా పార్టీ విధానాల్లో కీలకమైన మార్పులు చేర్పులు చేయాలనేది లోకేష్ ప్రణాళికగా కన్పిస్తోంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవం నినాదంతో నియంతృత్వాన్ని పారద్రొలినట్టు.. చంద్రబాబు ఆత్మ విశ్వాసం నినాదంతో తెలుగు ప్రజల భవిష్యత్తుకు బంగారు బాటలువేసినట్టుగా.. ఇప్పుడు మరో కొత్త నినాదాన్ని తెరపైకి తేవాలని లోకేష్ చాలా బలంగా భావిస్తున్నట్టు సమాచారం. ఈ కొత్త నినాదం.. టీడీపీకి కొత్త లుక్ తెచ్చేలా ఉండాలనే దిశగా లోకేష్.. ఆయన టీమ్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఆ ఆరు అంశాల విషయానికొచ్చేసరికి.. మహిళలు, రైతులు, యువత, కార్యకర్తల సంక్షేమం, సామాజిక న్యాయం, పేదరిక నిర్మూలన. ఈ అంశాల్లో పార్టీ పరంగా విధాన నిర్ణయాలు తీసుకునేలా.. పకడ్బందీ కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని విధాన నిర్ణయాలు సంచలనం సృష్టించేలా ఉంటాయనేది టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మొత్తమ్మీద కడపలో తొలిసారి జరగబోతున్న ఈ మాహానాడులో లోకేష్ మార్క్ స్పష్టంగా కన్పించనుంది.