
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హారీష్ రావును కొత్త బాధ్యతల్లో చూడబోతున్నామా? ఇటీవల కేటీఆర్, హారీష్ రావు మధ్య జరిగిన చర్చల సందర్భంగా తన మనసులోని మాటను హారీష్ రావు కేటీఆర్ ముందుంచినట్టు సమాచారం. ఇందుకు కేటీఆర్ కొంత వరకు సానుకూలంగా ఉన్నప్పటికీ అంతిమ నిర్ణయం కేసీఆర్ చేతుల్లో ఉంది. కేసీఆర్ అంగీకరిస్తే సిద్ధిపేట ఎమ్మెల్యే హారీష్ రావును ఇదివరకు చూడని సరికొత్త పాత్రలో చూసే అవకాశం ఉంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మే 16,17 తేదీల్లో కేటీఆర్-హారీష్ రావు మధ్య హారీష్ రావు నివాసంలో ఇద్దరి మధ్య విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లోనే తన అనుభవం, విధేయత, పనితీరు వంటి అంశాలను ఆధారంగా తీసుకొని బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ (శాసనసభ పక్ష నాయకుడు) పోస్టును తనకు కట్టబెట్టాలని హారీష్ రావు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీలో నాయకత్వ మార్పు అనేది జరగకుండా ఉండే పక్షంలో గతంలో మాదిరిగా పార్టీలో కొనసాగేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ నాయకత్వ మార్పు అనేది జరిగితే మాత్రం తన వైపు నుంచి కొన్ని అభ్యంతరాలు.. డిమాండ్లు ఉన్నాయని స్పష్టంగా చెప్పి మరీ శాసనసభా పక్ష నేతగా తాను ఉండాలని కోరుకుంటున్నట్టు తన మనస్సులోని మాటను కేటీఆర్ ముందు హరీష్ రావు ఉంచినట్టు తెలుస్తోంది.
గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన అనుభవం దృష్ట్యా అసెంబ్లీ ప్రోసిండిగ్స్ పై పూర్తి అవగాహన ఉంది తద్వారా నేను ఎల్పీ లీడర్ గా అసెంబ్లీలో ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడంతోపాటు ప్రభుత్వంపై మరింత పోరాటం చేస్తానని కేటీఆర్ ముందు హారీష్ స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే దీనికి కేటీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారనే చర్చ జోరుగా సాగుతోంది. దీనిపై ఫైనల్ డెసిషన్ కేసీఆర్ తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదే సమయంలో నాయకత్వ మార్పు జరుగుతున్న తరుణంలో హరీష్ రావు శాసనసభా పక్ష నేత స్థానాన్ని కోరుకోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. భవిష్యత్తును.. భవిష్యత్తులో జరిగే రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే హరీష్ బీఆర్ఎస్ ఎల్పీ స్థానంపై కన్నేసినట్టు సమాచారం. పార్టీలో నాయకత్వ మార్పు జరిగితే.. బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేటీఆర్ అవుతారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్ కొనసాగితే.. ఇక పార్టీపై హరీష్ రావుకు పట్టు అనేదే లేకుండా పోతుంది. అటు పార్టీ పరంగా లీడర్లు.. ఇటు అసెంబ్లీ ఎమ్మెల్యేలు అంతా కేసీఆర్ అండ్ సన్స్ చేతుల్లోనే ఉండిపోతారు.
దీనికి ఆస్కారం ఇవ్వకూడదనే హరీష్ రావు తెలివిగా శాసనసభ పక్ష స్థానం మీద కన్నేసినట్టు సమాచారం.
శాసనాసభ పక్ష స్థానం అంటే రాజకీయాల్లో చాలా కీలకమైన పదవి. ఈ స్థానంలో ఉన్న వారు.. కచ్చితంగా సీఎం రేసులోకి వచ్చి తీరుతారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే.. ఎవరు సీఎం అనే ప్రశ్న కచ్చితంగా కేడర్లో వచ్చి తీరాలనేది హరీష్ భావనగా కన్పిస్తోంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా ఉన్నారు. కాబట్టి తర్వాత అధ్యక్షుడు కేటీఆర్ అనే అంశాన్ని నెమ్మదిగా కేడర్ మైండ్లోకి జొప్పించారు. ఈ తరుణంలో పార్టీ అధినేత పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు వచ్చే అవకాశం లేదని హరీష్ రావుకు తెలుసు. దీంతో అధినేత స్థానంతో సమానమైన శాసనసభ పక్ష స్థానంపై తాను కూర్చొంటే.. తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది రాదనేది హరీష్ ఆలోచన.
బీఆర్ఎస్ పార్టీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరు..? అనే ప్రశ్న నిత్యం చర్చల్లో ఉంచేందుకే హరీష్ రావు శాసనసభా పక్ష స్థానం కావాలనే డిమాండును తెర మీదకు తెచ్చారనే చర్చ ఇంటర్నల్ సర్కిల్సులో జోరుగా సాగుతోంది.