అమరావతి విషయంలో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రధాని మోడీ.
ప్రధాని శంకుస్థాపనలు చేయడం కాదు.. బీజేపీ ఓన్ చేసుకోవాలి.. అంటున్న నిపుణులు.
రాజధానికి వీలైనంతగా చట్టబద్దత కల్పించాలని డిమాండ్లు..
ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. ఏపీకి అత్యంత ప్రాధాన్యతాంశాలుగా.. గ్రోత్ ఇంజిన్లుగా ఉండే రాజధాని అమరావతి.. పోలవరం ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలో దాదాపు మూలనపడ్డాయనే చెప్పాలి. ఓ విధంగా చెప్పాలంటే ఈ రెండు ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఎప్పుడూ సీరియస్సుగా తీసుకోలేదనే చెప్పాలి. ఇక అమరావతి విషయంలో అయితే గత ప్రభుత్వ ధోరణి మరీ దారుణంగా ఉందనే విమర్శలున్నాయి. ఏకంగా రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ కావాల్సిన అమరావతిని ఆదిలో తుంచేసేలా గత పాలకులు వ్యవహరించారనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
2024 ఎన్నికల్లో కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో ఈ రెండు ప్రాజెక్టులకు మళ్లీ జీవం పోసుకునే అవకాశం లభించింది. పోలవరం పనులు ఎప్పుడో పునః ప్రారంభం కాగా.. తాజాగా రాజధాని అమరావతి నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా పునః ప్రారంభించారు. దీంట్లో భాగంగా సుమారు 58 వేల కోట్ల రూపాయల మేర పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ప్రధాని కార్యక్రమంపై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో అంటే 2014-19 మధ్య కాలంలో అమరావతి పనులను ప్రారంభించింది ప్రధాని నరేంద్ర మోడీనే. ఆ రోజునే అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి భారీ ఎత్తున ప్యాకేజీని ఆశించారు. కానీ మనీ (మట్టి-నీరు) ప్యాకేజీ ఇచ్చి.. చేతులు దులుపుకుని వెళ్లిపోయారు నరేంద్ర మోడీ. ఇప్పుడు అదే మోడీ అదే రాజధాని పనులను పునః ప్రారంభించారు. ఈసారి 58 వేల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేశారు. అయితే
వీటిల్లో ఎంత వరకు వర్కవుట్ అవుతాయి..? ఎంత వరకు వీటిని పూర్తి చేయగలరనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఓ విధంగా చెప్పాలంటే రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి కేంద్రం నుంచి చాలా సాయం వివిధ రూపాల్లో అవసరం కానుంది. అది ఆర్థిక సాయం కావచ్చు.. మాట సాయం కావచ్చు.. ఇలా ఉంటాయి. ప్రస్తుతానికి కూటమి అంతా కలిసికట్టుగానే ఉంది.. కానీ గతంలో మాదిరిగా ఏదైనా తేడాలు వస్తే పరిస్థితేంటనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ.
ఈ క్రమంలో అమరావతి నిర్మాణ పనులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే రాజధానికి వీలైనంత త్వరగా చట్టబద్దత కల్పించాలి. మళ్లీ రాజధాని విషయంలో గతంలో మాదిరిగా తప్పులు జరగకుండా ఉండాలంటే.. కచ్చితంగా రాజధానికి.. అంటే అమరావతికి చట్టబద్దత కల్పించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇందుకు కేంద్రం తీసుకోవాల్సిన బాధ్యత చాలా ఉందనే చెప్పాలి. రాష్ట్రాన్ని విభజించినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో.. బాధిత రాష్ట్రంగా ఉన్న ఏపీకి రాజధాని ఏర్పాటు చేసే విషయంలోనూ అంతే బాధ్యతగా వ్యవహరించాలనే వాదనలు వినిపిస్తున్నాయి. సాంకేతికంగా ఈ తరహా చర్యలు తీసుకోవడం ద్వారా అమరావతిని ఇక అజరామరం చేయడానికి కేంద్రం చొరవ చూపినట్టు అవుతుంది. ఇది జరగాలంటే.. అమరావతి ప్రాంతాన్ని జాతీయ పార్టీలు.. ముఖ్యంగా బీజేపీ ఓన్ చేసుకోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో నాటి పాలకులు అమరావతి రాజధాని ప్రాంతాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుంటే.. కేంద్రం దాదాపు కళ్లు మూసుకుపోయినట్టే వ్యవహరించిందని చెప్పాలి. పైగా కొందరు బీజేపీ నేతలు అయితే.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం చేసిన రచ్చను సమర్థించినట్టుగా మాట్లాడారు. ఈసారి మాత్రం అలాంటి పొరపాట్లు జరగకూడదని గుర్తు చేస్తున్నారు.