పార్టీని గాడిలో పెట్టగలిగే స్థాయిలో పవన్ పని చేస్తున్నారా..?
కేడర్లో జోష్ నింపే ప్రయత్నాల్లో పవన్ ఎంత వరకు సక్సెస్ అవుతున్నారు..?
తాను స్థాపించిన పార్టీని ఓ కొలిక్కి తీసుకురావడానికి.. అధికారంలోకి తేవడానికి పవన్ కళ్యాణ్ పదేళ్లు పట్టింది. అది కూడా తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీ చేస్తేనే అది సాధ్యమైంది. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసినా.. సరైన ఓట్లు రాలేదు.. సీట్లు కూడా రాలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే.. ఆ రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతో కొంత.. రాజీతో కొంత అన్నట్టుగా కూటమి ఏర్పిడింది. 21 స్థానాల్లో పోటీ చేసి.. 21 స్థానాల్లోనూ గెలుపొందిన పరిస్థితి. ఇదో రకంగా సంచలనమే. 2024 ఎన్నికల్లో 21 స్థానాలను గెలిచారు. తాను కాకుండా.. మరో ఇద్దరికి మంత్రి పదవి ఇప్పించారు. ఇప్పటి వరకు ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు వచ్చేలా చేశారు. ఇక నామినేటెడ్ పోస్టుల్లోనూ జనసేన ముఖ్య నేతలకు.. ప్రయార్టీ ఇవ్వాల్సిన వారికి పదవులు కట్టబెడుతూనే ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ పార్టీ పటిష్టత గురించి.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం గురించి పవన్ కళ్యాణ్ ఎంత వరకు ఆలోచన చేస్తున్నారు.. దానికి సంబంధించిన ప్రణాళికలేమైనా ఉన్నాయా.. అంటే మాత్రం లేదనే సమాధానమే వస్తుంది.
టీడీపీ సంస్థాగతంగా బలోపేతమైన పార్టీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో కూడా పార్టీ కోసం పని చేసే వారు ఏర్పడ్డారు. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీకి కూడా సంస్థాగతంగా నెట్ వర్క్ ఉంది. అయితే జనసేన విషయానికొచ్చేసరికే ప్రధాన పార్టీలకున్న స్థాయిలో నెట్ వర్క్ జనసేనకు పెద్దగా ఉండడం లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీకి కేరాఫ్ అడ్రస్సుగా ఉంటున్న పరిస్థితి. ఓ కులం ఆధారంగా పార్టీని బిల్డప్ చేయడం చాలా కష్టసాధ్యమైన పని స్వయంగా పవన్ కళ్యాణుకు తెలిసినా.. ఎందుకో పార్టీ
బలోపేతం మీద ఫోకస్ పెడుతున్నట్టు కన్పించడం లేదు. ఒక్కసారి వ్యవస్థను ఏర్పాటు చేస్తే చాలు.. ఆ తర్వాత ఆ వ్యవస్థ పార్టీని ముందుకు నడిపిస్తాయి. కానీ ఇప్పటి వరకు జనసేన అగ్ర నేతలు కానీ.. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కానీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే అంశంపై ఫోకస్ పెడుతున్న పరిస్థితి కన్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీలోని ముఖ్య నేతల్లో కొందరికి నామినేటెడ్ పదవులు ఇప్పించినంత మాత్రాన సరిపోదని.. జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో పొలిటికల్ లుక్ రావాలంటే మరింత ప్రణాళికాబద్దంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఇక ఇప్పటికీ జనసేన అంటే కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాల పార్టీగానే కన్పిస్తోంది తప్ప.. గోదావరి గట్టు దాటి మాత్రం ముందుకు రాలేకపోతోంది జనసేన. గడచిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉమ్మడి శ్రీకాకుళం, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కో స్థానం వచ్చినా.. ఆ సమయంలో వైసీపీ మీదున్న వ్యతిరేకత వల్ల జనసేన అభ్యర్థులు గెలిచారే తప్ప.. వారి సొంత ఛరిష్మానో.. పార్టీ ఫ్లేవర్ వల్లో గెలవలేదు. అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పార్టీని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా పవన్ కళ్యాణ్ చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను పదే పదే ప్రస్తావించడం ద్వారా.. ఆయా నియోజకవర్గాల్లో తరుచూ పర్యటించడం ద్వారా పవన్ కళ్యాణ్ కొద్దిగా ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఎన్నికల నాటికి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి గ్రామస్థాయిలో పార్టీకి ఓ మనిషంటూ ఉండాలి.. పార్టీ జెండాను భుజాన వేసుకునే వ్యక్తులు ప్రతి కుగ్రామంలోనూ కనీసం పది మందైనా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే పార్టీ గ్రామస్థాయిలో బలోపేతం కాగలదు. కానీ ప్రస్తుతం ఆ దిశగా జనసేన అడుగులు వేస్తున్నట్టు ఎంత మాత్రమూ కన్పించడం లేదు.
ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం.. లేదా ప్లీనరీలు చేసుకోవడంతో పాటు.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం.. సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ సహా పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టకుంటే.. 100 శాతం స్ట్రైక్ రేట్ వచ్చినా.. 200 శాతం స్ట్రైక్
రేట్ వచ్చినా నిలబడదని అంటున్నారు. మరి ఈ దిశగా ప్రస్తుతానికైతే జనసేన అడుగులు పడుతున్నట్టు కన్పించడం లేదు. గాలికి గెలిచేశారని గేలి కాకుండా ఉండాలంటే.. ఈదురు గాలులకు చెక్కు చెదరనంతగా.. అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ అన్నింటిని తట్టుకుని నిలబడే స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనేది పొలిటికల్ పండిట్స్ భావన.