
బొట్టు బొట్టు నా రక్తాన్ని రంగరించి కాళేశ్వరం కట్టానని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇప్పుడు ఆ కాళేశ్వరమే కాలనాగై వెంటాడుతోంది. పీసీ ఘోష్ కమిటీ కాల పరిమితి ముగిసింది. నివేదిక సిద్ధమైంది... రేపో మాపో ప్రభుత్వానికి సమర్పిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సడెన్ గా కమిషన్ కాల పరిమితి మరో రెండు నెలలు పొడిగిస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కథ సుఖాంతమైంది అని ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఈ ఉత్తర్వులతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.
ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు ఎక్కుపెట్టాయి. కాళేశ్వరం కమిషన్ కాదు... కాంగ్రెస్ కమిషన్ అంటూ ఆరోపణలు మొదలు పెట్టాయి. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా... కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? విద్యుత్ కమిషన్ విషయంలో న్యాయస్థానం నుండి ఊరట పొందినట్టు... ఇక్కడ కూడా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? చివరిగా కాళేశ్వరం విచారణలో ఏం తేలబోతోంది? కమిషన్ నివేదిక ఏం చెప్పబోతోంది? ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి? కాళేశ్వరం అవినీతి శకలాలు కేసీఆర్ ను తాకుతాయా? లాంటి ప్రశ్నలు మళ్లీ తెర మీదకు వచ్చాయి.
తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటి మీద కునుకు లేకుండా తనను వెంటాడిన కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి అంత తేలికగా వదిలేస్తాడని ఎవరూ ఊహించలేరు. కాకపోతే, కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఒక తేడా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుల పై కక్ష విషయంలో కేసీఆర్ ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించారు. తాను అనుకుంటే చాలు ఏదో ఒక నెపంతో ఊచలు లెక్కబెట్టించారు. నాయకుల ఇళ్ల తలుపులు బద్ధలు కొట్టి మరీ వికృత కక్షలకు పాల్పడ్డారు. ఐతే, రేవంత్ రెడ్డి స్కూల్ వేరు. ఆయన కేసీఆర్ అండ్ కోను పద్ధతిగా, చట్టబద్ధంగా ఊచలు లెక్కబెట్టించాలని ఆశ పడుతున్నారు. ఏదీ కావాలని చేశారన్న భావన ప్రజలకు రాకూడదన్న కోణంలో ఆయన కేసీఆర్ ఫ్యామిలీని ఊచలు లెక్కబెట్టించాలని ఆశిస్తున్నారు.
అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫార్ములా కారు రేసు, విద్యుత్ కమిషన్ విచారణ లాంటి వాటిల్లో ఇప్పటి వరకు ఊచించినంత తీవ్రంగా ఎలాంటి చర్యలు లేవు. ప్రతి కేసులో తప్పించుకోలేని విధంగా ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే ప్రధాన ఘట్టానికి తెర లేపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. న్యాయ పరంగా ఏ చిన్న లొసుగు లేకుండా, ఎక్కడా జారీ పోయే అవకాశం లేకుండా ఫిక్స్ చేయాలన్నది ఆయన ప్రయత్నంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కాళేశ్వరం విషయమే తీసుకుంటే... పీసీ ఘోస్ కమిషన్ విచారణను ఐదారు సార్లు పొడిగించారు. అప్పటి ఇంజనీర్లు, ఉన్నతాధికారులను పదే పదే పిలిచి విచారించారు. కొందరు అధికారుల నుండి అఫిడవిట్లు తీసుకున్నారు. హరిరాం లాంటి ఈఎన్సీ పై ఏసీబీ దాడి చేయించి... అక్రమాస్తుల చిట్టా విప్పారు. మరోవైపు విజిలెన్స్ విచారణలు చేయిస్తున్నారు. ఒక వైపు విజిలెన్స్ విచారణ, మరోవైపు కమిషన్ విచారణ, మరోవైపు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇట్లా అన్నీ వైపుల నుండి కచ్చితమైన సాక్ష్యాలతో గత పాలకులను దోషులుగా తేల్చే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తున్నారు. కేసీఆర్ అండ్ కో విచారణ లేకుండానే కమిషన్ తన విచారణను ముగిస్తుందని అందరూ భావిస్తున్న సమయంలో మళ్లీ రెండు నెలలు కమిషన్ కాల పరిమితి పెంచి... గులాబీ శ్రేణుల్లో అలజడి రేపారు.
ఈ నేపథ్యంలో కమిషన్ విచారణ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అన్నట్టుగా సాగబోతోంది. నిన్నటి వరకు అధికారులు, జల నిపుణులతో మాత్రమే విచారణ జరిపిన కమిషన్... ఇక రాజకీయ నాయకుల విచారణ మొదలు పెట్టబోతోంది. ఇందులో మొదటగా జూన్ 5న కేసీఆర్ ను విచారణకు పిలిచింది. ఆయన వెళతారా... వెళ్లరా... వెళ్లకుండా న్యాయస్థానం నుండి ఏమైనా రిలీఫ్ కోరతారా... వెళితే కమిషన్ ముందు ఆయన ఏం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ వెళ్లి... తర్వాత జూన్ 6 న హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరైతే విచారణ ఇక కొలిక్కి వచ్చినట్టే. కేసీఆర్ గైర్హాజరై... హరీష్ రావు మాత్రమే కమిషన్ ముందుకు వెళితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మరో అంశం. కేసీఆర్ వెళ్లకుండా హరీష్ మాత్రమే వెళితే... హరీష్ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారు... కేసీఆర్ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇక వీళ్లిద్దరితో పాటు కేసీఆర్ పాత సహచరుడు ఈటెల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కమిషన్ ముందు ఏం చెబుతారన్నది మరింత ఆసక్తి కరం. దేవాలయ భూములు, అసైన్డ్ భూముల విషయంలో ఈటెలను కేసీఆర్ తీవ్రంగా వేదించారు. తనను మానసికంగా, ఆర్థికంగా వేదించిన కేసీఆర్ గుట్టును ఈటెల కమిషన్ ముందు విప్పుతారా... లేక మాజీ బాస్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బీఆర్ఎస్ లైన్ లోనే తన వాదన వినిపిస్తారా..? అనేది చూడాల్సి ఉంది.
కాళేశ్వరం కలకలం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.