
బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్, హారీష్ రావు కేంద్రంగా గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలకు పుల్ స్టాప్ పడిందా..బావబామ్మర్ధుల మధ్య రాజీ కుదిరిందా? కేటీఆర్ తో భేటీ తర్వాత హారీష్ రావు గుంభనంగా ఉంటున్నారు తప్పితే పార్టీలో చోటు చేసుకుంటున్న సంఘటనలపై మౌనం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్, హరీష్ మధ్య ఏదో రాజీ కుదిరిందనే మాట వినిపిస్తుంది.
బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ నిర్వహణ, సమన్వయ బాధ్యతలను మొదట హారీష్ రావుకు కేసీఆర్ అప్పగించారు. తర్వాత పార్టీలో, కుటుంబంలో ఏమి జరిగిందో తెలియదు కానీ కేటీఆర్ రంగం ప్రవేశం చేశారు. కర్త, కర్మ, క్రియ అన్ని తానై బీఆర్ఎస్ పార్టీ 25వ వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఒక రకంగా కేసీఆర్ కు వారసుడిగా తనకు తాను ప్రమోట్ చేసుకోవడానికి కేసీఆర్ ఆ సభను వినియోగించుకున్నారు.
ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడి, ట్రాబుల్ షూటర్ గా పేరు తెచ్చుకొని తనకు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో హారీశ్ నొచ్చుకున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకోసమే పాదయాత్రగా సభగా వెళ్లాలనుకున్న నిర్ణయాన్ని మార్చుకొని కారులోనే సభకు హాజరయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. ఈ పరిణమాలను బట్టి బావబామ్మర్ధులు కేటీఆర్-హారీష్ రావు గ్యాప్ ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందనే విశ్లేషణలు వచ్చాయి.
తెలంగాణభవన్‌లో మే 13న నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు సిద్ధమని హారీశ్ రావు ప్రకటించిన తర్వాత కూడా మే 16, 17 తేదీల్లో కేటీఆర్..హారీశ్ రావు నివాసానికి వరుసగా రెండు రోజులపాటు వెళ్లి గంటగంటలు చర్చలు జరపడంతోనే బావబామ్మర్ధుల మద్య పైకి కనిపించినంతా సఖ్యత లేదనే వాదనకు బలం చేకూరింది. అయితే ఈ చర్చల తర్వాత పార్టీ బలోపేతంపై చర్చించినట్లు మీడియా ముఖంగా చెప్పినప్పటికీ అంతర్గతంగా జరిగింది వేరని విశ్లేషకుల ఆభిప్రాయం.
కేటీఆర్ తో చర్చలో హరీష్ రావు..పార్టీలో తన ప్రాధాన్యతను తగ్గించడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ కు అండగా ఉంటూ చెప్పిన మాట జవదాటకుండా పార్టీ ఉన్నతి కోసం చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తగా పని చేస్తుంటే అవమానాలకు గురి చేయడం సరికాదని గట్టి స్వరంతో చెప్పారని సన్నిహితుల సమాచారం. ఇకపై ఇటువంటి పునరావృత్తమైతే కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడని హెచ్చరించినట్లు కూడా తెలిసింది.
ఈ నేపథ్యంలో హారీష్ రావుకు పార్టీలో తగిన గౌరవం ఇచ్చేలా..తనతో సమానమైన బాధ్యతలు అప్పగించేందుకు కేటీఆర్ అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు బావబామ్మర్ధుల మధ్య రాజీ కుదిరినట్లు ఇద్దరి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పార్టీ అనుబంధ సంఘాల (ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్) ఇంచార్జ్ తోపాటు రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపే మరో కీలక పదవి ఇచ్చేందుకు కేటీఆర్ ఒప్పుకున్నారని కేసీఆర్ తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయాలను బహిర్గతం చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇటీవల కాళేశ్వరం నోటీసుల అందిన తర్వాత హరీష్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో వరుసగా రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో కుదిరిన రాజీ వ్యవహారం చర్చకు వచ్చినట్లు సమాచారం. అయితే సమయం చూసుకొని ప్రకటిద్దామని తొందరపడొద్దని అప్పటికీ వరకు రాముతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కేసీఆర్ సూచించినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే వీరద్దరి మధ్య రాజీ కుదిరింది అనే ప్రచారం నిజమేనా ? లేక కేవలం ఊహగానాలేనా? అనేది తేలాల్సి ఉంది. ఒక వేళ రాజీ కుదిరినా ఎంత కాలం సఖ్యతగా ఉంటారు అనేది అనుమానమేననే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.