25 C
Hyderabad
సోమవారం, జూలై 7, 2025

భయం లేకుంటే.. బరితెగించరా..?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడో ఆసక్తిర చర్చ జరుగుతోంది. 2009-14 మధ్య కాలంలో జరిగిన పరిణామాలే మళ్లీ జరుగుతున్నట్టుగా కన్పిస్తోంది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం నాడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు.. ఇప్పుడు మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో కన్పిస్తున్నాయనే చర్చ జరుగుతోంది. ఇంతకీ ఆ చర్చ ఏంటంటే.. నేతలు.. జైళ్లు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత పదేళ్లల్లో కేసీఆర్, గత ఐదేళ్లల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వాల్లోని వైసీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు.. తీసుకున్న నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వాలు దర్యాప్తు చేపడుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు.. ఇంకొందరు అధికారులు జైళ్లపాలయ్యారు. త్వరలోనే మరింత మంది అధికారులు.. కీలక నేతలు జైళ్లకు వెళ్లే అవకాశమూ కన్పిస్తోంది. వైసీపీ అధినేత.. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారని చర్చ జరుగుతోంది. ఇదే చర్చల్లో భాగంగా నేరుగా కాకున్నా.. పరోక్షంగా వైఎస్ జగన్ సతీమణి భారతీ రెడ్డి పేరును కూడా కొందరు తెర మీదకు తెస్తున్నారు.

ఈ నేపథ్యంలో సామాన్యుల్లో మరి ముఖ్యంగా న్యూట్రల్ పర్సన్సులో ఓ చర్చ జరుగుతోంది. చక్కగా రాజకీయం చేసుకోకుండా.. ఎందుకీ రచ్చ అంటున్నారు. తాము చేసే అవినీతి తమను జైళ్లకు పంపుతుందని తెలిసి కూడా డబ్బు సంపాదన కోసం ఎందుకు బరితెగిస్తున్నారు..? దీనికి కారణాలేంటీ..? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్, గాలి జనార్దన్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, కేసీఆర్, కేటీఆర్, కవిత ఇలా చాలా మందిపై అవినీతి ఆరోపణల కేసులున్నాయి. వీళ్లే కాకుండా కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మీద కేసులు నమోదయ్యాయి. వీరిలో కొందరు ఇప్పటికే జైళ్లల్లో ఉండగా.. ఇంకొందరు జైళ్లకు వెళ్లి వచ్చారు.. ఇంకొందరు జైళ్లకు వెళ్తారనే ప్రచారం ఉంది.

ఇలా జైళ్లకు వెళ్లి వచ్చిన వారు కూడా మళ్లీ అలాంటి పొరపాట్లే ఎందుకు చేస్తున్నారు అంటే.. దానికి ప్రతి ఒక్కరూ తలో రకమైన కారణం చెబుతారు. రాజకీయ నాయకుడైతే.. తమ పార్టీ ప్రత్యర్థులు తమపై కక్ష సాధిస్తున్నారని.. తమకు అడ్డంకే లేకుండా చేసుకోవడానికి గానూ.. ఇలా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ స్టీరియోటైప్డ్ స్టోరీస్ తరహాలో ఒకే మాట చెబుతారు. జైళ్లకు వెళ్తామని తెలిసి కూడా వైట్ కాలర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నారనే ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. వీరు అవినీతికి అలవాటు పడిపోయారా..? లేక మరే ఇతర కారణమేదైనా ఉందా..? పార్టీ అధినేతలే స్వయంగా బరి తెగిస్తే.. మిగిలిన నేతలు.. కార్యకర్తలు కూడా తమకు అందిన కాడికి దోచుకునేందుకు అలవాటు పడతారు కదా అనేది తాజా ఆందోళన.

ఇక జైళ్లకు వెళ్తామని తెలిసి కూడా అవినీతి చేయడానికి గల కారణాలను విశ్లేషిస్తే.. మారిన రాజకీయం అనే సమాధానం వస్తుంది. అవును రాజకీయమే ప్రధాన కారణం. పదవి కోసం.. అధికారం కోసం రాజకీయాల్లోకి వస్తారు.. పార్టీలు పెడుతున్నారు. అధికారం దక్కించుకోవాలంటే ఎన్నికల్లో వేల కోట్ల రూపాయలు కుమ్మరించాల్సి వస్తోంది. ఓ నియోజకవర్గంలో ముగ్గురు ప్రధాన అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే.. ఆ సెగ్మెంట్ నుంచి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..? తక్కువలో తక్కువ 150 కోట్ల రూపాయలు. అంటే ప్రతి పార్టీ సుమారుగా 50 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టక తప్పని సరి అవుతుంది. అయితే ఇది అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తరహా ఖర్చు అవుతుందని చెప్పలేం. కొన్నింటిలో తక్కువ ఖర్చు కావచ్చు.. ఇంకొన్నింటిలో ఎక్కువ ఖర్చు కావచ్చు. ఈ లెక్కన నియోజకవర్గానికి 40 కోట్ల రూపాయల మేర యావరేజ్ ఖర్చు అవుతుందని చెప్పొచ్చు.

దీని ప్రకారం ఓ రాజకీయ పార్టీ ఏపీలో ఎన్నికల్లో పోటీ చేయడానికి తక్కువలో తక్కువ 7000 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికొచ్చేసరికి.. ఆ ఖర్చు 4760 కోట్ల రూపాయలుగా ఉంటుందని ఓ అంచనా. ఇంత ఖర్చు పెట్టినా.. అధికారంలోకి వస్తారనే గ్యారెంటీ లేదు. దీని కోసం జరిగే రాజకీయం వేరుగా ఉంటుంది. ఎత్తులు పైఎత్తులు మామూలే. మరి ఇంత ఖర్చు అవుతున్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు.. అవకాశం దక్కినప్పుడు సంపాదించుకోకుంటే ఎలా..? అనేది మొదలైంది. దీంతో రాజకీయం వ్యాపారంగా మారింది. పాలిటిక్స్.. బిజినెస్సుగా ఎప్పుడైతే మారిందో.. అప్పుడు అందినకాడికి సంపాదించుకోవడం అలవాటుగా మారుతుంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి.. రూల్స్, రెగ్యులేషన్స్ పట్టించుకోరు. ఇదే సమయంలో మేం సంపాదిస్తున్న డబ్బు.. మా కోసం కాదు.. రాజకీయం కోసం అనే థియరీ మొదలు పెడతారు. అవినీతి తప్పు కాదు.. చేయకపోతేనే తప్పు అని ఆలోచించేలా చేస్తారు.

ఇక వీరు ఈ విధంగా విచ్చలవిడిగా వ్యవహరించడానికి కారణం.. మన న్యాయ వ్యవస్థ మీద అపారమైన నమ్మకం. అవినీతి కేసులు అంత త్వరగా తేలవు. అందునా రాజకీయ నేతల మీదున్న అవినీతి కేసులు ఎంత మాత్రమూ తేలవు. ఒకవేళ తేలినా.. జీవిత కాలం అయిపోతుందనే బలమైన నమ్మకం కొందరి రాజకీయ నేతలకు ఉండడం కూడా వైట్ కాలర్ నేరాలు రాజకీయాల్లో పెరిగిపోవడానికి ప్రధాన కారణం. జగన్ అక్రమాస్తుల కేసే చూస్తే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద అక్రమాస్తుల కేసులు నమోదై సుమారు 14 ఏళ్లు అవుతుంది. కొంత మేర ఈ కేసుల విషయంలో దర్యాప్తు జరిగినా.. చాలా కాలం నుంచి ఈ కేసుల దర్యాప్తు నత్తనకడన సాగుతుంది. ఈ కేసులు ఎప్పటికి ఓ కొలిక్కి వస్తాయో తెలియడం లేదు. పరిస్థితి చూస్తుంటే.. మరికొన్నేళ్ల పాటు.. జీళ్ల బంకలా ఈ కేసులు సాగడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ 14 ఏళ్ల కాలంలో జగన్ మోహన్ రెడ్డి సీఎంగా ఐదేళ్ల ఏపీని పరిపాలించారు. ఆయన టైమ్ బాగుండి ఉండుంటే.. మళ్లీ గెలిచేవారు. కానీ 2024 ఎన్నికల్లో ప్రజా తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.. వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అంటే అవినీతి కేసులున్నా.. కోర్టుల్లో ఆ కేసులు త్వరగా తేలవు కాబట్టి.. తమ రాజకీయాన్ని విచ్చల విడిగా చేసుకోవచ్చని రాజకీయ నాయకులకు అర్థమైంది. దీంతో అవినీతికి వెనుకాడడం లేదు.

ఇక జైళ్ల పాలవుతున్నా.. అవినీతి విషయంలో తగ్గేదెలే అని కొందరు రాజకీయ నేతలు వెనకడుగు వేయకపోవడానికి మరో కారణం హీరో వర్షిప్. ఒకప్పుడు జైలుకు వెళ్లడానికి సిగ్గు పడే రోజులు ఉండేవి. కానీ ప్రస్తుతం జైలుకు వెళ్తే పొలిటికల్ మైలేజ్ ఎంత వస్తుందని లెక్కలు వేస్తున్నారు. విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో జైలుకు వెళ్లి వస్తే హీరో వర్షిప్ వస్తుందని, రాజకీయంగా కలిసి వస్తుందని కొందరు నమ్ముతున్నారు. జగన్ విషయంలో అది నిజమైందనే విశ్లేషణలు కూడా వచ్చాయి.

కానీ జగన్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో గెలిచారు. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చాక గెలిచారు కానీ.. అప్పటికే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఇది చంద్రబాబు గెలుపునకు సగం కారణం అంతే కానీ.. చంద్రబాబు జైలుకు వెళ్లారని మాత్రమే ఆయన గెలిచారని అనుకోవడానికి లేదు. ఇక రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చాక గెలిచారు. కానీ 2023 ఎన్నికల నాటికి కేసీఆర్ ఫ్యామ్లీ మీద అన్ని వర్గాలు విరుచుకుపడడం మొదలైంది. ఇది రేవంత్ రెడ్డికి.. కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ఇక కేజ్రీవాల్ జైలుకు వెళ్లినా ఓటమి పాలయ్యారు. కాబట్టి అధికారానికి.. జైలు జీవితానికి సంబంధం లేదని అర్థమవుతుంది. కానీ ఎందుకో జైలుకు వెళ్తే హీరోగా చూడడం ఇప్పుడు రివాజుగా మారింది.

జగన్ జైలు ఎపిసోడ్ తర్వాత ఆయన్నో హీరోగా చూపే ప్రయత్నం జరిగింది. ఇది తెలుగు పొలిటిషీయన్లకు బాగా నచ్చింది. దీంతో తమ రాజకీయ ఎదుగుదలకు జైలు జీవితం అనేది కీలకం అనుకుంటున్నారు. దీంతో జైలుకు వెళ్లడానికి కొందరు మానసికంగా సిద్దపడిపోతున్నారు. అదో ప్రివిలేజ్ గా భావిస్తున్న పరిస్థితి. రాజకీయ నేతల ఆలోచనా విధానం ఈ విధంగా ఉంటే.. జైలు అనే భయమే ఉండదు. దీంతో అవినీతి చేస్తే ఇబ్బంది పడతామనే భావనే రాదు కాబట్టి.. కొందరు రాజకీయ నేతల అవినీతికి అంతే లేకుండా పోతోంది. జైళ్లకు వెళ్లి వచ్చినా.. ఏముందిలే జైలే కదా అని తెగిస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.

రాజకీయ నేతల తీరు ఈ విధంగా ఉంటే.. కొందరు అధికారుల తీరు మరీ అరాచకంగా ఉంది. కొందరు అధికారులు కూడా సీఎం స్థానంలో ఉన్న వారికి నిబంధనలకు విరుద్దంగా.. అడ్డగోలుగా సహకరించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఐఏఎస్ అధికారులు ధనుంజయ్ రెడ్డి, శ్రీలక్ష్మీ. ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు వంటి వారు అరెస్ట్ అయ్యారు. కానీ ఇప్పటికీ కొందరు అధికారులు తమ తీరు మార్చుకోవడం లేదు. కొందరు అవినీతి ఐఏఎస్ అధికారులు అయితే.. తాము అవినీతి చేయడమే కాకుండా.. ఎలా చేస్తే డబ్బులు వస్తాయోననే అంశాన్ని ముఖ్యమంత్రులకు.. మంత్రులకు.. సలహాలిచ్చే స్థాయికి చేరిపోయారు. ఇది క్షమించరాని అంశం. కానీ వీళ్లని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓ ఐఏఎస్ అధికారి పరారయ్యారనే వార్తలు రావడానికంటే సిగ్గుచేటైన అంశం ఉండదు. కానీ ఇలాంటి వాటిని లైట్ గా తీసుకుంటూ.. అవినీతి చేసి డబ్బు పోగేయాలనే భావన కొందరు అధికారుల్లో కన్పిస్తోంది.

ఓ విధంగా చెప్పాలంటే.. రాజకీయం.. పరిపాలన.. కేసులు.. కోర్టులు.. జైళ్లు.. అనేది ఇవాల్టీ రోజుల్లో సాధారణమైన అంశంగా మారిపోయింది. దీంతో జైలు.. బెయిలు.. సీఎం ఛైరు.. అనే వాతావరణం ఏర్పడింది. ఈ విధానం మారాలంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ఏది మంచి.. ఏది చెడు.. ఎవరికి ఓటేయాలి.. ఎవరికి ఓటేయకూడదు అనే విచక్షణతో ఆలోచన చేయాలి. ఆ స్పృహ రానంత వరకు విశ్లేషణల్లో విషయాలు మారతాయేమో కానీ.. సమాజంలో మార్పు మాత్రం రాదు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles