అమరావతి
ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. అయితే విభజన తర్వాత.. ఏపీకి మరో పేరూ వచ్చింది.. అమరావతి, పోలవరం. ఈ రెండు ఏపీ అభివృద్ధికి.. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టులుగా ఉన్నాయి. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులు గత ఐదేళ్ల కాలంలో పెద్దగా ముందుకు నడవని పరిస్థితి కన్పించింది. రాజధాని నిర్మాణం అవసరమే లేదని.. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించవచ్చని.. అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రాన్ని జపించి.. అమరావతి ప్రాజెక్టును అటకెక్కించేసింది గత ప్రభుత్వం. ఇక మరో రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అడుగులు అంతంత మాత్రంగానే గత ప్రభుత్వంలో పడ్డాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం 3-4 శాతం పనులు మాత్రమే జగన్ హయాంలో జరిగాయి. ఇక ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయలేదు జగన్ ప్రభుత్వం. ఇది చాలదన్నట్టు.. గత ప్రభుత్వ పెద్దలు.. అధికారుల వైఖరి కారణంగా ఢయాఫ్రం వాల్ దెబ్బతింది. ఇప్పుడు కొత్తగా ఢయా ఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి. ఇదీ అమరావతి. పోలవరం ప్రాజెక్టుల విషయంలో కూటమి అధికారంలోకి రాకముందు వరకు ఉన్న పరిస్థితి.
అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంలో కదలిక వచ్చింది. ఈ క్రమంలో ఏపీ పరిపాలన, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన మంత్రుల మధ్య ఇప్పుడు రన్నింగ్ రేస్ జరుగతోందని అంటున్నారు. రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులుగా ఉన్న ఈ రెండింటికీ నారాయణ-నిమ్మల మంత్రులుగా ఉన్నారు. తమ తమ పరిధిలోని ప్రాజెక్టులను ఎవ్వరూ ముందుగా కంప్లీట్ చేస్తారు.. ఏ మంత్రి ఈ ప్రాజెక్లులకు త్వరగా ఓ రూపును తెస్తారు.. గ్రోత్ ఇంజిన్, జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టులను జాతికి ఎంత త్వరగా ఎవరు అంకితం చేస్తారనేది ఇప్పుడు హాట్ డిస్కషనుగా మారింది. ఈ రన్నింగ్ రేసులో ఇప్పటికే నిమ్మల ముందు వరుసలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరాన్ని కంప్లీట్ చేసేస్తామని ధీమాగా చెబుతున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కానీ మంత్రి నారాయణ పరిధిలోని అమరావతి ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తిగా పనులు మొదలు కాలేదు. కేంద్రం రాజధాని నిర్మాణానికి తమ వైపు నుంచి ఆర్థిక చేయూత అందించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించినా.. దాన్ని వెంటనే యాక్టీవేట్ చేయించడంలో మంత్రి నారాయణ విఫలమయ్యారనే చర్చ జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా బ్యాంకర్ల లాబీయింగ్ విషయంలో మంత్రి నారాయణ ఘోరంగా విఫలమయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాగే కొందరి కాంట్రాక్టర్లకు సహకరించడం కోసం నారాయణ చేస్తున్న ఒత్తిడి కారణంగా అమరావతి ప్రాజెక్టు పనుల రీ-లాంఛ్ జాప్యమైందనేది మరో వాదన
ఈ చర్చ సంగతి ఎలా ఉన్నా.. పోలవరం ప్రాజెక్టు కంటే అమరావతికి రూపే త్వరగా వచ్చే ఛాన్స్ కన్పిస్తోందనేది సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. రీ-లాంఛ్ పనులు ప్రారంభం కావడానికి జాప్యం అయినా.. తాము లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తామనే ధీమా నారాయణ టీములో కన్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ రీ-లాంఛ్ పనులు ప్రారంభించేశారు కాబట్టి.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు.. అనుమతులు ప్యూర్లీ మన దేశానికి సంబంధించిన వ్యవహరమేనని.. కానీ అమరావతి అంతర్జాతీయ సంస్థలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి.. కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైందని అంటున్నారు.
ఈ విధంగా ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఇద్దరు మంత్రులు చాలా కీలకమైన ప్రాజెక్టులను తమ భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఇదేదో రాజకీయపరమైన వ్యవహరంగా కాకుండా.. రాష్ట్రానికి.. రాష్ట్రాభివృద్ధికి ముడి పడి ఉన్న అంశంగా భావించి.. పనులను పరుగులు పెట్టించాలని కోరుకుంటున్నారు. ఇందులో ఏ మాత్రం అలక్ష్యం చేసినా.. తేడాలు చేసినా.. ఆ మంత్రులను ప్రజలు ఎన్నటికీ క్షమించరని కూడా హెచ్చరిస్తున్నారు నిపుణులు.