
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం తాజాగా వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కుమార్తె పార్టీలోని పరిణామాలపై లేఖ రాశారని ఇప్పటి వరకు ప్రచారంగా మాత్రమే ఉంది. కానీ కవిత తన బాపుకు రాసిన లేఖ ఇప్పుడు బహిర్గతమైంది. ఆ లేఖలోని సారాంశం చూస్తుంటే.. అది లేఖ కాదు.. లేఖాస్త్రం అనే రీతిలో ఉంది.
పార్టీలోని పరిణామాల మీద.. మరి ముఖ్యంగా తన సొదరుడు కేటీఆర్ తీరు మీద కవిత గుస్సాగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో.. అదంతా అక్షర సత్యమని లేఖలోని అంశాలతో తేటతెల్లమైంది. లేఖలో ఎక్కడా నేరుగా కేటీఆర్ గురించి ప్రస్తావించకున్నా.. కవిత టచ్ చేసిన కొన్ని అంశాలు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసేలా ఉన్నాయి.
ఇప్పుడు లేఖ బయటకు వచ్చేసింది కాబట్టి.. ఆ లేఖలో ఏమున్నాయోననేది ఇక ఓపెన్. కానీ ఆమెకు లేఖ రాసేందుకు ప్రేరేపించిన కారణాలేంటీ..? కేవలం పార్టీలో పెత్తనం కోసమే ఆమె నాన్న, అన్నతో విబేధిస్తున్నారా..? లేక దీనికి మించిన కారణాలు ఏమైనా ఉన్నాయా..? అంటే ఉన్నాయనే అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు.
పార్టీలో కీలకంగా ఉండాలని కవిత కోరుకోవడంలో తప్పేం లేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమించారు. ఇప్పటికే ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ తరహాలో ఉద్యమ నేపథ్యం, రాజకీయ నేపథ్యం ఉన్న కవితకు సహజంగానే పార్టీలో కీలకంగా ఉండాలనే కోరిక ఉండడం సహజం. కానీ ఆమె తన నాన్నకు లేఖ రాయడానికి కారణం మాత్రం అంతకు మించేననేది బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
కవిత అసంతృప్తికి కారణం ఇప్పుడు జరిగిన పరిణామాలు కాదని తెలుస్తోంది. కల్వకుంట్ల కవిత ఆవేదనకు బీజాలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నాడే పడ్డట్టు సమాచారం. ఓసారి వెనక్కు వెళ్తే.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు తెర మీదకు వచ్చిన తొలినాళ్లల్లో లిక్కర్ కుంభకోణం విషయమై కేసీఆర్ మిమ్మల్ని తిట్టారట కదా అని ఆమెను ఓ ఇంటర్వ్యూలో అడిగారు. ఆ రోజు ఆ ప్రశ్నను నిర్ద్వంధంగా తిప్పికొట్టింది. అది నిజం కాదంటూ కొట్టిపారేశారు కవిత. కానీ అదే నిజమని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు.. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు క్లారిటీ వస్తోంది. ఆమె అసంతృప్తికి కారణాలను చూస్తే..
Reason 1:
లిక్కర్ కుంభకోణంలో కవితకు తన కుటుంబం నుంచి వూర్తి స్థాయిలో సహకారం లభించ లేదని సమాచారం. పైగా జైల్లో ఉన్నప్పుడు కుటుంబం నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోవడం.. ఆమెను ఈ కేసు నుంచి కానీ.. జైలు నుంచి బయట వేయడంలో నాన్న, అన్నల నుంచి అంతగా కో-ఆపరేషన్ లేదని అంటున్నారు.
Reason 2:
ఇక పార్టీ ఓడిపోయాక జరిగిన ప్రచారం మరో కారణం. పార్టీ ఓటమికి కవితే కారణమని పార్టీలో వారే.. ఓ విధంగా చెప్పాలంటే అన్న కేటీఆర్.. ఆయన అనుచరగణం తనపై ఈ దుష్ప్రచారం చేశారని.. ఆమెతోపాటు ఆమె సన్నిహితులు బలంగా నమ్ముతున్నారు. ఇదేదో తాము కోపంతో అంటున్న మాట కాదని.. నిజాలని నిర్ధారించుకున్నామనేది కవిత వైపు వాదన. ఈ పరిణామం ఆమెను మరింతగా కుంగదీసిందని అంటున్నారు.
Reason 3:
లాస్ట్ బట్ నాట్ లీస్ట్. పార్టీలో.. రాజకీయాల్లో కవితను యాక్టీవుగా ఉండొద్దని నాన్న, అన్న చెప్పేశారని బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు. ఇవి గుసగుసలు కావు.. నిజమేనని కవిత సన్నిహితులు చెబుతున్నారు. జైలుకెళ్లొచ్చిన తనకు పెత్తనం ఇవ్వకున్నా ఫర్వాలేదు.. కనీసం యాక్టీవుగా కూడా ఉండొద్దని చెప్పడాన్ని కవిత ఎంత మాత్రమూ లైటుగా తీసుకోలేకపోతున్నారనేది బీఆర్ఎస్ వర్గాల టాక్.
ముక్తాయింపు:
ఇప్పుడు కవిత అన్న మీద విపరీతమైన కోపంతో రగిలిపోతున్నారని అంటున్నారు. తనను రాజకీయంగా అణగదొక్కడంలో అన్న కీలక పాత్ర పోషించారని భావిస్తున్నారు. నాన్నకు ఉన్నవి లేనివి చెప్పి.. తనకు.. తన తండ్రికి గ్యాప్ పెంచారని ఆమె అనుమాన పడుతున్నారట. తన అసంతృప్తిని వివిధ సందర్భాల్లో తన తండ్రి వద్ద ప్రస్తావించినా.. లాభం లేకపోవడంతో ఆమెకు లేఖ రాయక తప్పలేదని కవిత వర్గం చెబుతోంది. ఈ క్రమంలో తన భవిష్యత్ కంటే.. అన్న కేటీఆర్ నిజస్వరూపాన్ని బయట ప్రపంచానికి తెలియచెప్పేందుకు కవిత లేఖాస్త్రం ఎక్కుపెట్టారని బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది.