ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటేలా కార్యక్రమం నిర్వహించిన షర్మిళ..
వైఎస్ ఛర్మిషాను వాడుకోలేకపోతున్న షర్మిళ.
దారి తప్పిన షర్మిళను దారిలో పెట్టేదెవరని కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ.
అమరావతి
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు పదేళ్లకు పూర్వమే చనిపోయింది. విభజన పాపం ఆ పార్టీని వెన్నాడి.. వేటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని క్షమించలేకపోతున్నారు.. ఆ పార్టీ చేసిన తప్పును మరిచిపోలేకపోతున్నారు. దీనికి తగ్గట్టు వైఎస్సార్సీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించడంతో కాంగ్రెస్ ఉనికి చాటుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాస్తో కూస్తో పట్టాలెక్కిద్దామనే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ తనయ షర్మిళను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది.. ఆమెను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది.
షర్మిళ రాకతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒకట్రోండు స్థానాలైనా సాధిస్తుందేమోనని ఆశపడింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ అది నెరవేరలేదు. గడచిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఓటమిని నమోదు చేసుకుంది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ ఈ స్థాయిలో ఓటమి పాలు కావడానికి తాను.. తాను చేసిన ప్రచారం కూడా ప్రధానమైనదేనని షర్మిళ ఆ క్రెడిట్టులో కొంత భాగాన్ని తన ఖతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూసిన వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయని.. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి కూడా వైసీపీ నుంచి వలసలు వస్తాయని 2024 ఎన్నికలు ముగిసిన తొలినాళ్లల్లో అనుకున్నారు. షర్మిళ వైఎస్ కుమార్తె కాబట్టి.. వైఎస్ జగన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు కాబట్టి.. ఇక కుమార్తె వైపు వైసీపీ నేతలు.. శ్రేణులు చూస్తారని అంతా అంచనా వేసుకున్నారు.
అయితే ఆ అంచనాలను తలకిందులు చేసింది వైఎస్ షర్మిళ. ఎన్నికల ప్రచార సమయంలో ఏదో కొద్దిపాటి హడావుడి చేసిన షర్మిళ.. ఆ తర్వాత ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపలేకపోతున్నారు. ఎన్నికలకు ముందైనా.. వైసీపీ నుంచి కొంత మంది వచ్చారేమో కానీ.. ఎన్నికలు ముగిసిన అనంతరం వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా చేరికలు లేవు. సరికదా.. షర్మిళ తీరుతో విసిగిపోయిన వారు పార్టీని వీడి వెళ్తున్నారు. ఇంకొందరు పార్టీలోనే ఉంటూ అసమ్మతి గ్రూప్ గా చలామణి అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించిన వారిలో ముఖ్యుడు మాజీ పీసీసీ చీఫ్ శైలజానాధ్ ఉన్నారు. లీడర్లు పోతే పోయారు.. కనీసం మిగిలిన కొద్దిమందితోనైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చు.. కానీ అది కూడా చేయడానికి షర్మిళ వెనుకా ముందు ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఈ తరుణంలో అమరావతిలో నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా షర్మిళ ఓ కార్యక్రమాన్ని చేపట్టడం.. దాన్ని ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడం వంటి పరిణామాలతో పార్టీపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్న ముసలి ముతకా కాంగ్రెస్ శ్రేణుల్లో ఏదో చిన్నపాటి ఆశ మిణుకు మిణుకుమంటూ మెరిసిందట. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికిని చాటుకునేలా చేసిన ఈ చిన్నపాటి ప్రయత్నమే సదురు మిగిలిన కేడరును సంతోషపెడుతోందట. మరీ ఈ తరహా కార్యక్రమాలు ఇక ముందు కూడా ఉంటాయా..? లేక మళ్లీ అటకెక్కుతాయా..? అని అనుమానం కాంగ్రెస్ కేడర్లో కన్పిస్తోంది.