
రేపో మాపో రాష్ట్ర బీజేపీ పగ్గాలు పట్టుకుందామని ఆశ పడుతున్న ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణ నోటీసు ఇరకాటంలో పడేసినట్టుంది. బీజేపీ అధిష్టానం నుండి ప్రెసిడెంట్ అపాయింట్ మెంట్ లెటర్ వస్తుందని ఆశించారు.
ఈలోగానే కాళేశ్వరం కమిషన్ నుండి విచారణ నోటీసు రావడం ఆయనకు చికాకు తెప్పించే అంశమే. అమిత్ షా ఆశీస్సులు నాకే ఉన్నాయి... నేనే ప్రెసిడెంట్ అని నమ్మిన ఈటెలకు ఇప్పుడు ఇది కొత్త చిక్కు అనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నిర్ణయం జరుగుతుందా!? జరిగితే ఈటెలకే ఇస్తారా...!? సారీ బాస్ అంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.
సహజంగా ఐతే కాళేశ్వరం కమిషన్ నుండి నోటీసు రావడాన్ని ఈటెల అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. తనను అస్సైన్డ్ భూముల విషయంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన ఆ అస్త్రాన్ని వాడుకోవచ్చు. కానీ, ఈటెల రాజేందర్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చిందులు తొక్కుతున్నారు. కమిషన్ విచారణకు హాజరవుతా అంటూనే... దేవరాయాంజల్ భూముల విషయంలో కేసీఆర్ తప్పు చేసినట్టే ఇవ్వాళ రేవంత్ రెడ్డీ తప్పు చేస్తున్నాడని ఈటెల మండి పడుతున్నారు.
రేవంత్ రెడ్డి బెదిరిస్తే తాను భయపడనని... కేంద్రంలో తామే అధికారంలో ఉన్నామన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఈటెల హెచ్చరిస్తున్నారు. ఒక వైపు రేవంత్ రెడ్డి బెదిరిస్తే బెదరను అంటూనే... మరోవైపు కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తిరిగి బెదిరిస్తున్నారు ఈటెల.
ఈ నోటీసులతో ఈటెల రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటి రేపో మాపో అందుకోవాల్సిన అధ్యక్ష పదవికి ఈ నోటీసులు ఏమైనా చెక్ పెడతాయేమోనన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. ఇక కమిషన్ ముందు విచారణకు హాజరై ఏం చెప్పాలన్నది మరో సమస్య. కేసీఆర్ తప్పు చేశాడు అని చెబితే ఆ నాటి కేబినెట్ మంత్రిగా ఆ తప్పులో తనకూ వాటా ఉంటుంది. కేసీఆర్ తప్పు చేయలేదని చెబితే... ఈటెల బీజేపీలో చేరినా ఇంకా కేసీఆర్ పక్షానే నిలబడ్డాడన్న రాజకీయ వాదన తెర మీదకు వస్తుంది. ఇట్లా ఇప్పుడు ఈటెల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. బహుషా అందుకేనేమో ఆయన ఈ నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చిందులు తొక్కుతున్నారు.