24 C
Hyderabad
బుధవారం, జూలై 9, 2025

మెట్టు దిగుతారా..? గట్టు దాటుతారా..?

కేసీఆర్ కు కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలంగాణలో తాజా సంచలనం. కూతురు రూపంలో బీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టిందనే చర్చ జరుగుతోంది. కవిత రాసిన లేఖలో ఆమె ఉద్దేశాలేంటో స్పష్టంగానే అర్థమవుతున్నాయి. అయితే లేఖ రాసిన కవిత భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది.. పార్టీలో ఉంటూనే ఫైట్ చేస్తారా..? లేక సొంత కుంపటి అంటే వేరే పార్టీ పెడతారా..? లేక అదీ ఇదీ కాక వేరే దారి వెతుక్కుంటారా.. అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా మారింది. అమెరికా వెళ్లిన కవిత తిరిగి వచ్చిన తర్వాత నుంచి కొన్ని రోజుల పాటు కవిత చుట్టూ తెలంగాణ రాజకీయం చక్కర్లు కొట్టే ఛాన్స్ కన్పిస్తోంది. కవిత అడుగులు ఎటు వైపు అనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పుడు ఆమె ముందు నాలుగు ఆప్షన్లు ఉన్నాయి..

ఆప్షన్-1: రాజీపడడం.
రాజీపడిపోయి.. నాన్న, అన్న చెప్పినట్టు రాజకీయాలకు దూరంగా ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. అలాంటి ఆలోచనే కవితకు ఉండే పక్షంలో కేసీఆర్ కు లేఖ రాసేవారే కాదు. కాబట్టి ఆప్షన్-1ను పక్కన పెట్టేయొచ్చు.

ఆప్షన్-2: పార్టీలో ఉంటూనే పోరాడడం
పార్టీలోనే ఉంటూ పోరాడడం. ఈ దిశగా కవిత కొంత ఆలోచన చేయవచ్చేమోననే చర్చ జరుగుతోంది. జైలుకెళ్లొచ్చిన తనకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదని ఆమె పార్టీలోనే ఉంటూ తన వాయిస్ గట్టిగా వినిపించవచ్చు. బయటకు వెళ్తే మరో షర్మిళలా కాకుండా ఉండాలంటే పార్టీలో ఉంటూనే ఫైట్ చేస్తే.. చివరకు పార్టీలో కీలక స్థానాన్ని దక్కించుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ ఆప్షన్ను ఎంచుకుంటే కవిత రాజకీయం చేయడమనేది కత్తి మీద సాములాంటి వ్యవహరంగా మారుతుంది. అనుక్షణం.. ప్రతిక్షణం రాజకీయం చేయాల్సి వస్తుంది. పైగా నాన్న, అన్న, బావ ఇప్పుడు ఒకే జట్టులో ఉన్నట్టుగా కన్పిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి పిల్లర్లుగా ఉన్న ఈ ముగ్గురిని కాదని.. కవిత వైపు మొగ్గు చూపే కేడర్ ఎంత వరకు ఉంటారోననేది అనుమానమే. కేడర్ నుంచి.. ద్వితీయ శ్రేణి నేతల నుంచి సపోర్ట్ అంతంత మాత్రంగా ఉంటే.. ఆమె రాజకీయ జీవితం ఇక్కడితో క్లోజ్ అవుతుందనే వారూ లేకపోలేదు.

ఆప్షన్-3: సొంత పార్టీ పెట్టడం.
సొంత పార్టీ పెట్టడం.. ప్రస్తుతం చర్చ అంతా ఈ ఆప్షన్ చుట్టూనే తిరుగుతోంది. కవిత కచ్చితంగా పార్టీ పెడతారనే టాక్ చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇంకొందరైతే.. కవిత ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టేశారనే వారూ ఉన్నారు. ఏదైనా బలమైన ఒత్తిడి ఉంటూనే.. కేసీఆర్, కేటీఆర్ వంటి వారు ఓ మెట్టు దిగితేనో తప్ప.. కవిత మళ్లీ బీఆర్ఎస్ ట్రాకులోకి రారనే వాదన వినిపిస్తోంది. తెలంగాణ జాగృతిపేరుతో కవిత చాలా కాలంగా ఓ వ్యవస్థను నడిపిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యం తెలంగాణ జాగృతికి ఉంది. ఈ అనుభవం కవితకు ఉంది కాబట్టి.. కొత్త పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయనే చర్చే ఎక్కువగా జరుగుతోంది. అవసరమైన పక్షంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చనేది కొందరి అభిప్రాయం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త పార్టీ మనుగడ సాగించడం ఏమంత తేలికైనా వ్యవహరం కాదు. దానికి వేలాది కోట్ల రూపాయల నిధులు కావాలి.. నిధులున్నా కవిత వెంట వచ్చే కేడర్ కావాలి.. ఇదీ ఉన్నా.. కవితను నమ్మి ఓట్లేసే ప్రజలు కావాలి.. ఇది చాలా టఫ్ టాస్క్ అంటున్నారు.

ఆప్షన్-4: కాంగ్రెస్ పార్టీలో చేరడం.
ఇది కవితకు కొంత వరకు సేఫ్ అంటున్నారు. రాజకీయంగా కొన్ని విమర్శలు వస్తాయి. కానీ బీజేపీ లాంటి పార్టీలో చేరడం కంటే.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్న బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడం కంటే.. తెలంగాణ తెచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని భావించానని చెప్పుకోవచ్చు. ఇది ఆమెకు పొలిటికలుగా సేఫ్ అయిన మార్గం అంటున్నారు. అయితే కాంగ్రెస్ ఆమెకు సెట్ అవుతుందా..? అనే చర్చ కూడా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఆమె పెత్తనం కొరుకున్నారు. అన్నతో సమానమైన స్థానం కోరుకున్నారు.. తన అన్న కంటే.. జైలుకు వెళ్లి వచ్చిన తానే సీఎం స్థానంలో కూర్చొవడానికి అర్హురాలినని కవిత భావిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పొలిటికల్ యాంబిషన్స్ ఉన్న క్రమంలో కవితకు కాంగ్రెస్ పార్టీ ఎంత వరకు అక్కరకు వస్తుందనేది డౌటేననేది కొందరి విశ్లేషణ. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆమె ఓ మామూలు లీడరుగా ఉండగలరే తప్ప.. సీఎం అభ్యర్థి కాలేరని కచ్చితంగా చెప్పొచ్చు. కవిత రాజకీయ లక్ష్యాలు చూస్తే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారా అనేది డౌటేనంటున్నారు.

ఇలా రకరకాల ఆప్షన్లు ఆమె ముందున్న తరుణంలో కవిత అడుగులు ఎటు వైపు పడతాయా..? అనేది తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్కుగా మారింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles