Home Blog Page 24

తన్నీరు లేకుంటే.. బీఆర్ఎస్ పార్టీకి కన్నీరే..

ట్రబుల్ షూటర్... నేటి బీఆర్ఎస్, నిన్నటి టీఆర్ఎస్ ఆవిర్భావం నుండి హరీష్ రావుకు ఉన్న ట్యాగ్ లైన్ ఇది. కేసీఆర్ కు పార్టీలో ఎప్పుడు క్రైసిస్ వచ్చినా ఆ సంక్షోభాన్ని సమర్ధంగా పరిష్కరించి... పార్టీ ఊపిరి పీల్చుకునేలా చేసే నాయకత్వ సామర్ధ్యం హరీష్ సొంతం. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 2018లో కొడంగల్ లో ఓడించడం వెనుక కూడా హరీష్ మానేజ్ మెంట్ స్కిల్స్ ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. ఐతే... రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ ను కేసీఆర్ సైడ్ ట్రాక్ చేయడం మొదలు పెట్టారు. హరీష్ రావును కేబినెట్ లోకి తీసుకోలేదు. ఒక్కడినే తీసుకోకపోతే సమస్య వస్తుందన్న ఉద్దేశంతో కేటీఆర్ ను కూడా కొద్ది రోజులు కేబినెట్ కు దూరంగా పెట్టారు. ఆ తర్వాత కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఆ తర్వాత ఇద్దరినీ కేబినెట్ లోకి తీసుకున్నారు. పేరుకు పెత్తనమే తప్ప... హరీష్ మాట చెల్లుబాటు కాకుండా చేశారు. క్రమంగా ఆయన స్థాయిని పార్టీలో తగ్గిస్తున్న సంకేతాలు ఇచ్చారు. 

తర్వాత కాలంలో హరీష్ ను కేవలం సిద్ధిపేటకు మాత్రమే పరిమితం చేశారు. సిద్ధిపేట – హైదరాబాద్ తప్ప మరో చోటకు హరీష్ వెళ్లలేని పరిస్థితి సృష్టించారు. తీవ్ర ఉక్కపోతకు గురి చేశారు. సహజంగా ఓపికకు బ్రాండ్ అంబాసిడర్ అన్న పేరున్న హరీష్... పంటి బిగువన ఈ ఉక్కపోతను భరించారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సమయానికి పరిస్థితి పరాకాష్ఠకు వెళ్లింది. తండ్రీ కొడుకులు కలిసి హరీష్ ఉనికిని పూర్తిగా ప్రశ్నార్థకం చేశారు. వరంగల్ సభకు ముందు హరీష్ ను ఇన్ ఛార్జ్ అని ప్రకటించారు. తర్వాత ఫాంహౌస్ లో ఏం చర్చలు జరిగాయో తెలియదు. సభా వేదికే మారిపోయింది. వరంగల్ ఎల్కతుర్తి నుండి మేడ్చల్ వద్దకు మారింది. సీన్ లో కేటీఆర్ రంగ ప్రవేశం చేసి మొత్తం కబ్జా పెట్టేశారు. పరిస్థితి మొత్తం కేటీఆర్ నియంత్రణలోకి వచ్చింది అనుకున్న తర్వాత సభ వేదికను మళ్లీ వరంగల్ కు మార్చారు. అక్కడ నుండి హరీష్ బొమ్మను పూర్తిగా చింపేసే దిశగా అడుగులు పడ్డాయి. ఏప్రిల్ 27 ఎల్కతుర్తి సభ నాటికి ఎటు చూసినా కేసీఆర్, కేటీఆర్ తప్ప మరో పేరు, బ్యానర్, జెండా లేకుండా చేశారు. అది రజతోత్సవ సభనా లేక కేటీఆర్ కు పార్టీ బాధ్యతలు అప్పగించే వేదికనా అన్న స్థాయిలో పరిస్థితి మారిపోయింది. 

మొదటి నుండి పార్టీలో ఉండి... హరీష్ తో కష్టం నష్టం పంచుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఈ పరిణామాలపై లోలోపలే మథన పడిపోయారు. హరీష్ భవిష్యత్ పై ఆందోళనలోకి జారి పోయారు. ఆయనే బాస్ అనుకున్న వాళ్లంతా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ లో హరీష్ శకం ముగిసిందన్న ఫీల్ వచ్చేసింది. ఆయనను ఏదో ఒక రోజు ముఖ్యమంత్రిగా చూడాలని ఆశ పడ్డ శ్రేణులు ప్రత్యామ్నాయాలపై చర్చించడం మొదలు పెట్టాయి. హరీష్ బీజేపీలోకి వెళ్లిపోవాలని కొందరు... లేదు సొంత పార్టీ పెట్టాలని కొందరు విశ్లేషణలు, వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు. ఈ ట్రబుల్ షూటర్ మాత్రం అదే ఓపికతో, సహనంతో జరుగుతున్న పరిణామాలన్నింటినీ పైకి మౌనంగా చూస్తూ ఉండిపోయారు. 

సీన్ కట్ చేస్తే... బీఆర్ఎస్ పార్టీలో కొత్త సంక్షోభం తెర మీదకు వచ్చింది. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాగం వినిపించడం పార్టీలో కొత్త చర్చకు దారి తీసింది. నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతావ్... అని సోది చెప్పే వాళ్లతో చెప్పించుకోవడం, పదేళ్లలో (కేసీఆర్ పాలనలో) సామాజిక తెలంగాణ సాధించలేదని మాట్లాడటం, కేటీఆర్ గొప్పగా చెప్పుకునే తలసరి ఆదాయం విషయంలో కవిత భిన్నమైన లెక్కలు చెప్పడం... దాల్ మే కుచ్ కాలా హై అన్న అనుమానాలను సృష్టించింది. దీనికి కొనసాగింపుగా కవిత కొత్త పార్టీ పెట్టబోతోందన్న ప్రచారం మొదలైంది. ఇప్పటికే కేసీఆర్ కు తన మనోవేధనను వివరిస్తూ లేఖ రాసిందన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. అట్టడుగున ఉన్న పలువురు పార్టీ శ్రేణులను పిలిపించుకుని కవిత చర్చలు జరుపుతున్నారన్న ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ తాజా పరిణామాలు బీఆర్ఎస్ లో ఏదో జరుగుతోందన్న సందేహాలకు బలం చేకూర్చాయి. 

సరిగ్గా 15 రోజుల క్రితం హరీష్ అడ్రస్ గల్లంతైందనుకున్న పరిస్థితుల నుండి తాజా పరిణామాలతో మళ్లీ హరీష్ తెర మీదకు వచ్చారు. ట్రబుల్ షూటర్ అన్న పేరుకు తగ్గట్టే ఈ సంక్షోభ సమయంలో మళ్లీ హరీష్ దిక్కయ్యారు. కేటీఆర్ స్వయంగా రెండు రోజులు హరీష్ ఇంటికి వెళ్లి చర్చల జరిపారు. ఏం చెప్పారో, ఏం మాట్లాడుకున్నారో తెలియదు. కానీ, కవిత కలకలం నేపథ్యంలో హరీష్ ఇంటికి కేటీఆర్ వెళ్లడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీష్ ను ఉక్కపోతకు గురి చేసిన కేటీఆర్... ఇప్పుడు అదే హరీష్ శరణు కోరుతూ ఆయన ఇంటికి వెళ్లడం హరీష్ రావు సామర్ధ్యాన్ని చెప్పకనే చెప్పింది. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ లో... “అంతలోనే ఎంత మార్పు!!” అన్న చర్చ నడుస్తోంది. 

బాటమ్ లైన్..: హరీష్ లేకుండా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయాలని భావిస్తే.. ఆ పార్టీ ప్రభావం జీరో అన్నది మరోసారి రుజువైంది.

అధ్యక్షా రేసులో ఈటెల... చివర్లో ట్విస్టు

రేపో మాపో రాష్ట్ర బీజేపీ పగ్గాలు పట్టుకుందామని ఆశ పడుతున్న ఈటెల రాజేందర్ ను కాళేశ్వరం కమిషన్ విచారణ నోటీసు ఇరకాటంలో పడేసినట్టుంది. బీజేపీ అధిష్టానం నుండి ప్రెసిడెంట్ అపాయింట్ మెంట్ లెటర్ వస్తుందని ఆశించారు.

ఈలోగానే కాళేశ్వరం కమిషన్ నుండి విచారణ నోటీసు రావడం ఆయనకు చికాకు తెప్పించే అంశమే. అమిత్ షా ఆశీస్సులు నాకే ఉన్నాయి... నేనే ప్రెసిడెంట్ అని నమ్మిన ఈటెలకు ఇప్పుడు ఇది కొత్త చిక్కు అనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నిర్ణయం జరుగుతుందా!? జరిగితే ఈటెలకే ఇస్తారా...!? సారీ బాస్ అంటారా అన్నది ఆసక్తికరంగా మారింది.

సహజంగా ఐతే కాళేశ్వరం కమిషన్ నుండి నోటీసు రావడాన్ని ఈటెల అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు. తనను అస్సైన్డ్ భూముల విషయంలో తీవ్రంగా ఇబ్బంది పెట్టిన కేసీఆర్ కు వ్యతిరేకంగా ఆయన ఆ అస్త్రాన్ని వాడుకోవచ్చు. కానీ, ఈటెల రాజేందర్ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చిందులు తొక్కుతున్నారు. కమిషన్ విచారణకు హాజరవుతా అంటూనే... దేవరాయాంజల్ భూముల విషయంలో కేసీఆర్ తప్పు చేసినట్టే ఇవ్వాళ రేవంత్ రెడ్డీ తప్పు చేస్తున్నాడని ఈటెల మండి పడుతున్నారు.

రేవంత్ రెడ్డి బెదిరిస్తే తాను భయపడనని... కేంద్రంలో తామే అధికారంలో ఉన్నామన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని ఈటెల హెచ్చరిస్తున్నారు. ఒక వైపు రేవంత్ రెడ్డి బెదిరిస్తే బెదరను అంటూనే... మరోవైపు కేంద్రంలో మేమే అధికారంలో ఉన్నాం అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని తిరిగి బెదిరిస్తున్నారు ఈటెల.

ఈ నోటీసులతో ఈటెల రెండు రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒకటి రేపో మాపో అందుకోవాల్సిన అధ్యక్ష పదవికి ఈ నోటీసులు ఏమైనా చెక్ పెడతాయేమోనన్న ఆందోళన ఆయనలో కనిపిస్తోంది. ఇక కమిషన్ ముందు విచారణకు హాజరై ఏం చెప్పాలన్నది మరో సమస్య. కేసీఆర్ తప్పు చేశాడు అని చెబితే ఆ నాటి కేబినెట్ మంత్రిగా ఆ తప్పులో తనకూ వాటా ఉంటుంది. కేసీఆర్ తప్పు చేయలేదని చెబితే... ఈటెల బీజేపీలో చేరినా ఇంకా కేసీఆర్ పక్షానే నిలబడ్డాడన్న రాజకీయ వాదన తెర మీదకు వస్తుంది. ఇట్లా ఇప్పుడు ఈటెల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. బహుషా అందుకేనేమో ఆయన ఈ నోటీసుల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై చిందులు తొక్కుతున్నారు.

జూన్5 - బిగ్ డే

బొట్టు బొట్టు నా రక్తాన్ని రంగరించి కాళేశ్వరం కట్టానని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ఇప్పుడు ఆ కాళేశ్వరమే కాలనాగై వెంటాడుతోంది. పీసీ ఘోష్ కమిటీ కాల పరిమితి ముగిసింది. నివేదిక సిద్ధమైంది... రేపో మాపో ప్రభుత్వానికి సమర్పిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో సడెన్ గా కమిషన్ కాల పరిమితి మరో రెండు నెలలు పొడిగిస్తూ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. కథ సుఖాంతమైంది అని ఊపిరి పీల్చుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఈ ఉత్తర్వులతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి.

ఈ పరిణామంతో బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు ఎక్కుపెట్టాయి. కాళేశ్వరం కమిషన్ కాదు... కాంగ్రెస్ కమిషన్ అంటూ ఆరోపణలు మొదలు పెట్టాయి. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా... కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా? విద్యుత్ కమిషన్ విషయంలో న్యాయస్థానం నుండి ఊరట పొందినట్టు... ఇక్కడ కూడా ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా? చివరిగా కాళేశ్వరం విచారణలో ఏం తేలబోతోంది? కమిషన్ నివేదిక ఏం చెప్పబోతోంది? ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఎలా ఉండబోతున్నాయి? కాళేశ్వరం అవినీతి శకలాలు కేసీఆర్ ను తాకుతాయా? లాంటి ప్రశ్నలు మళ్లీ తెర మీదకు వచ్చాయి.

తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటి మీద కునుకు లేకుండా తనను వెంటాడిన కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి అంత తేలికగా వదిలేస్తాడని ఎవరూ ఊహించలేరు. కాకపోతే, కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి ఒక తేడా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుల పై కక్ష విషయంలో కేసీఆర్ ఎలాంటి మొహమాటం లేకుండా వ్యవహరించారు. తాను అనుకుంటే చాలు ఏదో ఒక నెపంతో ఊచలు లెక్కబెట్టించారు. నాయకుల ఇళ్ల తలుపులు బద్ధలు కొట్టి మరీ వికృత కక్షలకు పాల్పడ్డారు. ఐతే, రేవంత్ రెడ్డి స్కూల్ వేరు. ఆయన కేసీఆర్ అండ్ కోను పద్ధతిగా, చట్టబద్ధంగా ఊచలు లెక్కబెట్టించాలని ఆశ పడుతున్నారు. ఏదీ కావాలని చేశారన్న భావన ప్రజలకు రాకూడదన్న కోణంలో ఆయన కేసీఆర్ ఫ్యామిలీని ఊచలు లెక్కబెట్టించాలని ఆశిస్తున్నారు.

అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఈ ఫార్ములా కారు రేసు, విద్యుత్ కమిషన్ విచారణ లాంటి వాటిల్లో ఇప్పటి వరకు ఊచించినంత తీవ్రంగా ఎలాంటి చర్యలు లేవు. ప్రతి కేసులో తప్పించుకోలేని విధంగా ఆధారాలు, సాక్ష్యాలు సేకరించిన తర్వాతనే ప్రధాన ఘట్టానికి తెర లేపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. న్యాయ పరంగా ఏ చిన్న లొసుగు లేకుండా, ఎక్కడా జారీ పోయే అవకాశం లేకుండా ఫిక్స్ చేయాలన్నది ఆయన ప్రయత్నంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కాళేశ్వరం విషయమే తీసుకుంటే... పీసీ ఘోస్ కమిషన్ విచారణను ఐదారు సార్లు పొడిగించారు. అప్పటి ఇంజనీర్లు, ఉన్నతాధికారులను పదే పదే పిలిచి విచారించారు. కొందరు అధికారుల నుండి అఫిడవిట్లు తీసుకున్నారు. హరిరాం లాంటి ఈఎన్సీ పై ఏసీబీ దాడి చేయించి... అక్రమాస్తుల చిట్టా విప్పారు. మరోవైపు విజిలెన్స్ విచారణలు చేయిస్తున్నారు. ఒక వైపు విజిలెన్స్ విచారణ, మరోవైపు కమిషన్ విచారణ, మరోవైపు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇట్లా అన్నీ వైపుల నుండి కచ్చితమైన సాక్ష్యాలతో గత పాలకులను దోషులుగా తేల్చే పట్టుదలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ప్రతి అడుగూ ఆచి తూచి వేస్తున్నారు. కేసీఆర్ అండ్ కో విచారణ లేకుండానే కమిషన్ తన విచారణను ముగిస్తుందని అందరూ భావిస్తున్న సమయంలో మళ్లీ రెండు నెలలు కమిషన్ కాల పరిమితి పెంచి... గులాబీ శ్రేణుల్లో అలజడి రేపారు.

ఈ నేపథ్యంలో కమిషన్ విచారణ ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు అన్నట్టుగా సాగబోతోంది. నిన్నటి వరకు అధికారులు, జల నిపుణులతో మాత్రమే విచారణ జరిపిన కమిషన్... ఇక రాజకీయ నాయకుల విచారణ మొదలు పెట్టబోతోంది. ఇందులో మొదటగా జూన్ 5న కేసీఆర్ ను విచారణకు పిలిచింది. ఆయన వెళతారా... వెళ్లరా... వెళ్లకుండా న్యాయస్థానం నుండి ఏమైనా రిలీఫ్ కోరతారా... వెళితే కమిషన్ ముందు ఆయన ఏం చెప్పబోతున్నారు అన్నది ఇప్పుడు తీవ్ర ఆసక్తికరంగా మారింది.

కేసీఆర్ వెళ్లి... తర్వాత జూన్ 6 న హరీష్ రావు కూడా కమిషన్ ముందు హాజరైతే విచారణ ఇక కొలిక్కి వచ్చినట్టే. కేసీఆర్ గైర్హాజరై... హరీష్ రావు మాత్రమే కమిషన్ ముందుకు వెళితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది మరో అంశం. కేసీఆర్ వెళ్లకుండా హరీష్ మాత్రమే వెళితే... హరీష్ తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేశారు... కేసీఆర్ మాత్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇక వీళ్లిద్దరితో పాటు కేసీఆర్ పాత సహచరుడు ఈటెల రాజేందర్ జూన్ 9న విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయన కమిషన్ ముందు ఏం చెబుతారన్నది మరింత ఆసక్తి కరం. దేవాలయ భూములు, అసైన్డ్ భూముల విషయంలో ఈటెలను కేసీఆర్ తీవ్రంగా వేదించారు. తనను మానసికంగా, ఆర్థికంగా వేదించిన కేసీఆర్ గుట్టును ఈటెల కమిషన్ ముందు విప్పుతారా... లేక మాజీ బాస్ ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బీఆర్ఎస్ లైన్ లోనే తన వాదన వినిపిస్తారా..? అనేది చూడాల్సి ఉంది.

కాళేశ్వరం కలకలం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.

ఇక ఏపీలో నిమ్మల వర్సెస్ నారాయణ.. ఇద్దరు మంత్రుల చేతుల్లో ఆంధ్రప్రదేశ్ జీవనాడి, గ్రోత్ ఇంజిన్ ప్రాజెక్టులు.. ప్రస్తుతం రేసులో ముందు ఉన్న నిమ్మల..

అమరావతి
ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. అయితే విభజన తర్వాత.. ఏపీకి మరో పేరూ వచ్చింది.. అమరావతి, పోలవరం. ఈ రెండు ఏపీ అభివృద్ధికి.. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన ప్రాజెక్టులుగా ఉన్నాయి. ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులు గత ఐదేళ్ల కాలంలో పెద్దగా ముందుకు నడవని పరిస్థితి కన్పించింది. రాజధాని నిర్మాణం అవసరమే లేదని.. మూడు రాజధానుల ద్వారా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపించవచ్చని.. అభివృద్ధి వికేంద్రీకరణ మంత్రాన్ని జపించి.. అమరావతి ప్రాజెక్టును అటకెక్కించేసింది గత ప్రభుత్వం. ఇక మరో రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అడుగులు అంతంత మాత్రంగానే గత ప్రభుత్వంలో పడ్డాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం 3-4 శాతం పనులు మాత్రమే జగన్ హయాంలో జరిగాయి. ఇక ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని అమలు చేయలేదు జగన్ ప్రభుత్వం. ఇది చాలదన్నట్టు.. గత ప్రభుత్వ పెద్దలు.. అధికారుల వైఖరి కారణంగా ఢయాఫ్రం వాల్ దెబ్బతింది. ఇప్పుడు కొత్తగా ఢయా ఫ్రం వాల్ నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి. ఇదీ అమరావతి. పోలవరం ప్రాజెక్టుల విషయంలో కూటమి అధికారంలోకి రాకముందు వరకు ఉన్న పరిస్థితి.

అయితే 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణంలో కదలిక వచ్చింది. ఈ క్రమంలో ఏపీ పరిపాలన, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సంబంధించిన మంత్రుల మధ్య ఇప్పుడు రన్నింగ్ రేస్ జరుగతోందని అంటున్నారు. రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులుగా ఉన్న ఈ రెండింటికీ నారాయణ-నిమ్మల మంత్రులుగా ఉన్నారు. తమ తమ పరిధిలోని ప్రాజెక్టులను ఎవ్వరూ ముందుగా కంప్లీట్ చేస్తారు.. ఏ మంత్రి ఈ ప్రాజెక్లులకు త్వరగా ఓ రూపును తెస్తారు.. గ్రోత్ ఇంజిన్, జీవనాడి లాంటి ఈ ప్రాజెక్టులను జాతికి ఎంత త్వరగా ఎవరు అంకితం చేస్తారనేది ఇప్పుడు హాట్ డిస్కషనుగా మారింది. ఈ రన్నింగ్ రేసులో ఇప్పటికే నిమ్మల ముందు వరుసలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. 2027 నాటికి పోలవరాన్ని కంప్లీట్ చేసేస్తామని ధీమాగా చెబుతున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. కానీ మంత్రి నారాయణ పరిధిలోని అమరావతి ప్రాజెక్టు మాత్రం ఇంకా పూర్తిగా పనులు మొదలు కాలేదు. కేంద్రం రాజధాని నిర్మాణానికి తమ వైపు నుంచి ఆర్థిక చేయూత అందించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించినా.. దాన్ని వెంటనే యాక్టీవేట్ చేయించడంలో మంత్రి నారాయణ విఫలమయ్యారనే చర్చ జోరుగా జరుగుతోంది. ముఖ్యంగా బ్యాంకర్ల లాబీయింగ్ విషయంలో మంత్రి నారాయణ ఘోరంగా విఫలమయ్యారనే చర్చ జోరుగా సాగుతోంది. అలాగే కొందరి కాంట్రాక్టర్లకు సహకరించడం కోసం నారాయణ చేస్తున్న ఒత్తిడి కారణంగా అమరావతి ప్రాజెక్టు పనుల రీ-లాంఛ్ జాప్యమైందనేది మరో వాదన

ఈ చర్చ సంగతి ఎలా ఉన్నా.. పోలవరం ప్రాజెక్టు కంటే అమరావతికి రూపే త్వరగా వచ్చే ఛాన్స్ కన్పిస్తోందనేది సీఆర్డీఏ వర్గాలు చెబుతున్నాయి. రీ-లాంఛ్ పనులు ప్రారంభం కావడానికి జాప్యం అయినా.. తాము లేటుగా వచ్చినా లేటెస్టుగా వస్తామనే ధీమా నారాయణ టీములో కన్పిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ రీ-లాంఛ్ పనులు ప్రారంభించేశారు కాబట్టి.. పోలవరం ప్రాజెక్టుకు నిధులు.. అనుమతులు ప్యూర్లీ మన దేశానికి సంబంధించిన వ్యవహరమేనని.. కానీ అమరావతి అంతర్జాతీయ సంస్థలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి.. కొద్దిగా ఆలస్యంగా ప్రారంభమైందని అంటున్నారు.

ఈ విధంగా ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఇద్దరు మంత్రులు చాలా కీలకమైన ప్రాజెక్టులను తమ భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఇదేదో రాజకీయపరమైన వ్యవహరంగా కాకుండా.. రాష్ట్రానికి.. రాష్ట్రాభివృద్ధికి ముడి పడి ఉన్న అంశంగా భావించి.. పనులను పరుగులు పెట్టించాలని కోరుకుంటున్నారు. ఇందులో ఏ మాత్రం అలక్ష్యం చేసినా.. తేడాలు చేసినా.. ఆ మంత్రులను ప్రజలు ఎన్నటికీ క్షమించరని కూడా హెచ్చరిస్తున్నారు నిపుణులు.

విజయసాయి దెబ్బ.. వైసీపీ అబ్బ..

రక్షకుడే శిక్షకు కారకుడు కానున్నారా..?
అంతఃపుర రహస్యాల గుట్టును విజయ సాయి విప్పనున్నారా..?
జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి రెడ్డి అప్రూవరుగా మారనున్నారా..?
వైఎస్ కుమార్డుగా జగన్ చేసిన అక్రమాల జాబితాను ఆధారాలతో సహా విజయ సాయి అందించనున్నారా..?
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ.

అమరావతి
ఇంటి గుట్టు లంకకు చేటు అంటారు. ఇప్పుడు వైసీపీ విషయంలో ఇలాగే జరగబోతోందా..? ఇంటి గుట్టు తెలిసిన విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో విబేధించారు. దానికి కారణాలు కోటరీ మీదకు నెట్టినా.. విజయసాయి ఆగ్రహం మాత్రం నేరుగా తన మాజీ బాస్ జగన్ మోహన్ రెడ్డి మీదే ఉందనే చర్చ ఇప్పటికే ఏపీ పొలిటికల్ సర్కిల్సులో ఉంది. వైసీపీ వరకు.. లేదా వైఎస్ ఫ్యామ్లీ వరకు విజయ సాయిరెడ్డి అంటే ఏదో మామూలు ఆడిటర్ కాదు. అంతఃపురం రహస్యాలన్నీ తెలిసిన విభీషణుడు లాంటి వాడు.

వైఎస్ కుటుంబంలో మూడు తరాలు అంటే వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబాలకు చెందిన ఆస్తిపాస్తుల గురించి ఇంచ్ ఇంచ్ తెలిసిన వాడు. అంతా సాఫీగా ఉంటే.. విజయసాయి రెడ్డి వల్ల వైఎస్ కుటుంబానికి.. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో.. ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు.. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు.. ఎఫ్ఐఆర్ లు.. ఛార్జీ షీట్లు.. వంటి వ్యవహరాలు.. జైళ్లు.. బెయిళ్లు వంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ప్రతి అంశమూ జగను కంటే ఎక్కువగా విజయ సాయిరెడ్డికే ఎక్కువగా తెలుసనడంలో ఎలాంటి సందేహం లేదు. పైగా జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్తే.. ఆయన్ను వెన్నంటి ఉన్నారు విజయసాయి.. ఓ విధంగా చెప్పాలంటే అక్రమాస్తుల వ్యవహరంలో జగన్-విజయసాయి రెడ్డిది పాలు-నీళ్ల బంధం.. అలాగే వెలుగు నీడ అనుబంధం.

అలాంటి విజయసాయి రెడ్డి.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిది విబేధించారు. రాజ్యసభకు రాజీనామా చేశారు. పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పటికే మద్యం స్కాంలో జరిగిన చాలా లోగుట్టు వ్యవహరాలను సిట్ బృందానికి.. ప్రభుత్వ పెద్దలకు వివరించేశారని సమాచారం. ఇదంతా ఓ ఎత్తు అయితే.. అసలు జగన్ మోహన్ రెడ్డి మీదున్న సీబీఐ-ఈడీ కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. చాలా కాలంగా చలనం లేకుండా అలా పడి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో.. మారిన పరిణామాలతో జగన్ మోహన్ రెడ్డి మీదున్న పాత కేసులన్నీ మళ్లీ క్యూ కట్టి కోర్టు ముందుకు వచ్చే సూచనలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు చర్చ ఏంటంటే.. సీబీఐ, ఈడీ కేసుల విషయంలో విజయసాయి రెడ్డి జగనుకు సంబంధించిన గుట్టును విప్పనున్నారా అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ఆ కేసుల్లో విజయసాయి రెడ్డి అప్రూవరుగా మారుతారా అనే చర్చ కూడా విపరీతంగా జరుగుతోంది. ఎందుకంటే.. జగన్ మీద.. జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద విజయసాయి రెడ్డి చాలా సీరియస్సుగా ఉండడమే కారణమంటున్నారు. జగన్ కోసం.. అంతా తానై చేయడమే కాకుండా.. జైలుకు కూడా వెళ్తే.. తనకు కాకుండా.. వేరే వారికి ప్రయార్టీ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అని విజయసాయి రెడ్డి భావిస్తున్నారట. దీంతో వీలైనంత వరకు అంతఃపురం రహస్యాలను బయటపెట్టడానికి ఇప్పటికే టీడీపీ పెద్దలతో ఒప్పందం కుదిరిపోయిందనే చర్చ యమ జోరుగా సాగుతోంది.

ఇదే కనుక జరిగితే.. ఏపీలో రాజకీయాలు భవిష్యత్తులో చాలా మలుపులు తిరగడమే కాదు.. ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయనేది ఏపీలో జరుగుతున్న చర్చ.

షర్మిళలో ఎట్టకేలకు చలనం..

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటేలా కార్యక్రమం నిర్వహించిన షర్మిళ..
వైఎస్ ఛర్మిషాను వాడుకోలేకపోతున్న షర్మిళ.
దారి తప్పిన షర్మిళను దారిలో పెట్టేదెవరని కాంగ్రెస్ పార్టీలో విస్తృతంగా చర్చ.

అమరావతి
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది దాదాపు పదేళ్లకు పూర్వమే చనిపోయింది. విభజన పాపం ఆ పార్టీని వెన్నాడి.. వేటాడుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని క్షమించలేకపోతున్నారు.. ఆ పార్టీ చేసిన తప్పును మరిచిపోలేకపోతున్నారు. దీనికి తగ్గట్టు వైఎస్సార్సీపీ బలమైన ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించడంతో కాంగ్రెస్ ఉనికి చాటుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాస్తో కూస్తో పట్టాలెక్కిద్దామనే ప్రయత్నాల్లో భాగంగా వైఎస్ తనయ షర్మిళను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావించింది.. ఆమెను పీసీసీ అధ్యక్షురాలిగా నియమించింది.

షర్మిళ రాకతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒకట్రోండు స్థానాలైనా సాధిస్తుందేమోనని ఆశపడింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ అది నెరవేరలేదు. గడచిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ ఓటమిని నమోదు చేసుకుంది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. వైసీపీ ఈ స్థాయిలో ఓటమి పాలు కావడానికి తాను.. తాను చేసిన ప్రచారం కూడా ప్రధానమైనదేనని షర్మిళ ఆ క్రెడిట్టులో కొంత భాగాన్ని తన ఖతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. 2024 ఎన్నికల్లో ఘోరమైన ఓటమిని చవిచూసిన వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయని.. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలోకి కూడా వైసీపీ నుంచి వలసలు వస్తాయని 2024 ఎన్నికలు ముగిసిన తొలినాళ్లల్లో అనుకున్నారు. షర్మిళ వైఎస్ కుమార్తె కాబట్టి.. వైఎస్ జగన్ అట్టర్ ప్లాప్ అయ్యాడు కాబట్టి.. ఇక కుమార్తె వైపు వైసీపీ నేతలు.. శ్రేణులు చూస్తారని అంతా అంచనా వేసుకున్నారు.

అయితే ఆ అంచనాలను తలకిందులు చేసింది వైఎస్ షర్మిళ. ఎన్నికల ప్రచార సమయంలో ఏదో కొద్దిపాటి హడావుడి చేసిన షర్మిళ.. ఆ తర్వాత ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపలేకపోతున్నారు. ఎన్నికలకు ముందైనా.. వైసీపీ నుంచి కొంత మంది వచ్చారేమో కానీ.. ఎన్నికలు ముగిసిన అనంతరం వైసీపీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా చేరికలు లేవు. సరికదా.. షర్మిళ తీరుతో విసిగిపోయిన వారు పార్టీని వీడి వెళ్తున్నారు. ఇంకొందరు పార్టీలోనే ఉంటూ అసమ్మతి గ్రూప్ గా చలామణి అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించిన వారిలో ముఖ్యుడు మాజీ పీసీసీ చీఫ్ శైలజానాధ్ ఉన్నారు. లీడర్లు పోతే పోయారు.. కనీసం మిగిలిన కొద్దిమందితోనైనా కార్యక్రమాలు నిర్వహించవచ్చు.. కానీ అది కూడా చేయడానికి షర్మిళ వెనుకా ముందు ఆడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.

ఈ తరుణంలో అమరావతిలో నరేంద్ర మోడీ పర్యటన సందర్బంగా షర్మిళ ఓ కార్యక్రమాన్ని చేపట్టడం.. దాన్ని ప్రభుత్వం, పోలీసులు అడ్డుకోవడం వంటి పరిణామాలతో పార్టీపై పూర్తిగా ఆశలు వదిలేసుకున్న ముసలి ముతకా కాంగ్రెస్ శ్రేణుల్లో ఏదో చిన్నపాటి ఆశ మిణుకు మిణుకుమంటూ మెరిసిందట. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఉనికిని చాటుకునేలా చేసిన ఈ చిన్నపాటి ప్రయత్నమే సదురు మిగిలిన కేడరును సంతోషపెడుతోందట. మరీ ఈ తరహా కార్యక్రమాలు ఇక ముందు కూడా ఉంటాయా..? లేక మళ్లీ అటకెక్కుతాయా..? అని అనుమానం కాంగ్రెస్ కేడర్లో కన్పిస్తోంది.

బాబుకు.. పవనుకు బిగ్ షాక్ ఇచ్చిన బీజేపీ..

ఎవ్వరూ ఊహించని విధంగా పాకా సత్యనారాయణ పేరును రాజ్యసభకు ఖరారు చేసిన బీజేపీ..
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు హైకమాండ్ గా మారిన బీజేపీ.

ఏపీలో కూటమి ఏర్పడింది. ఎన్నికల్లో కూటమిలోని మూడు పార్టీల అభ్యర్థులు అద్భుతమైన విజయం సాధించారు. ఇందులో ఏ పార్టీ పాత్ర ఎంత వరకు ఉందనే విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో కొత్తగా చెప్పేదేం లేదు. కానీ ఏపీలోని కూటమిని రాజకీయంగా ఎక్కువగా ప్రభావితం చేస్తోంది మాత్రం కచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనేననే విషయం కచ్చితంగా చెప్పొచ్చు. ఏపీలో ఎమ్మెల్సీ స్థానాలు కానీ.. ఎంపీ స్థానాలు కానీ ఖాళీ అయితే.. అక్కడ ఎవరిని భర్తీ చేయాలోననే అంశాన్ని తేల్చేది.. తేల్చి చెప్పేది మాత్రం బీజేపీనే. ఒకవేళ బీజేపీలోని కూటమిలోని మిగిలిన రెండు పార్టీలకు ఇబ్బంది అయినా సరే.. టీడీపీ లేదా జనసేన అన్ని మూసుకుని కూర్చొవాల్సిందే. అవును.. కచ్చితంగా మూసుకోవాల్సిందే. రాజ్యసభలో బీజేపీ ఖరారు చేసిన అభ్యర్థిత్వాన్ని చూసిన తర్వాత ఇదే తరహా చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ సీనియర్ నేత.. పాకా సత్యనారాయణ పేరును ఖరారు చేసింది బీజేపీ. ఈ పేరును.. ఈ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తుందని ఎవ్వరూ ఊహించ లేదు.

సరే ఎవరు పార్టీ అభ్యర్థిని వారు ఖరారు చేసుకుంటారు.. ఇందులో కూటమిలోని మిగిలిన పార్టీలకు వచ్చే ఇబ్బంది ఏంటనే చర్చ రావడం సహజం. కానీ గత చరిత్రతో పాటు.. రాజ్యసభ సీటు ఖరారు విషయంలో ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే బీజేపీ కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల అధినాయకత్వాలను ఎంతగా ఇబ్బంది పెడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సీటు ఎవరి కోసం అనుకున్నారు.. చివరకు అది ఎక్కడకు చేరిందోననేది ఆసక్తికరంగా ఉంది. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్ని తిరిగి విజయసాయి రెడ్డికే కేటాయిస్తారనే చర్చ జరిగింది. ఆ తర్వాత విజయసాయి రెడ్డికి కాదు.. వేరే వ్యక్తులకు కేటాయిస్తారని

రకరకాల పేర్లూ వినిపించాయి. వాటిల్లో భాగంగా తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ అన్నామలైకు కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అలాగే మరో పేరు మందకృష్ణ మాదిగ రాజ్యసభకు వెళ్తారని చాలా విస్తృతంగా చర్చ జరిగింది. రాజ్యసభ టిక్కెట్ విజయసాయి రెడ్డికి ఇవ్వడం ఇష్టం లేని వారు ఈ రకమైన వాదనను తెర మీదకు తెచ్చారనే చర్చ జరిగినా.. రాజ్యసభ స్థానానికి అయితే విజయసాయి రెడ్డి.. లేదా అన్నామలై అదీ లేదా మంద కృష్ణ మాదిగలో ఎవ్వరో ఒకరికి దక్కుతుందని మాత్రం చాలా మంది బావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. బీజేపీ సీనియర్ నేత పాకా సత్యనారాయణకు ఆ స్థానాన్ని ఖరారు చేసింది.

ఇది టీడీపీ-జనసేనలకు చాలా ఇబ్బందికర అంశమేననే చర్చ ఇప్పటికే జరుగుతోంది. పాకా సత్యనారాయణ పేరు ఎవ్వరూ ఊహించని అంశమైతే.. పాకా సత్యనారాయణ గత చరిత్ర కూడా దీనికి ప్రధాన కారణంగా కన్పిస్తోంది. పాకా సత్యనారాయణ కావడానికి పార్టీ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు.. అందరూ ఆయన్ను గౌరవిస్తారు. కానీ ఆయనకు ఇంకో ముద్ర కూడా ఉంది. అదేటంటే.. పాకా సత్యనారాయణ చంద్రబాబు వ్యతిరేకి.. సోము వీర్రాజుకు సన్నిహితుడు అనే ముద్ర చాలా బలంగా ఉంది. ఇప్పుడు పాకా అభ్యర్థిత్వం ఖరారు చేయడంతో ఇదే తరహా చర్చ జరుగుతోంది. కూటమి ఏర్పడిన నాటి నుంచి బీజేపీ తాను అనుకున్న మాట నెరవేర్చుకుంటుందే తప్ప.. మిత్రపక్షాల మాటలను ఏ మాత్రం లక్ష్యపెట్టడం లేదనే చర్చ జరుగుతోంది. బీజేపీ కారణంగానే జనసేన కొన్ని అసెంబ్లీ సీట్లను.. లోక్ సభ స్థానాలను తగ్గించుకుంది. ఇక టీడీపీ కూడా చాలా వరకు రాజీ పడింది. ఎన్నికల్లో రఘు రామకృష్ణం రాజుకు నరసాపురం టిక్కెట్ ఇచ్చేందుకు బీజేపీ ససేమిరా అంది. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో రఘు రామకృష్ణం రాజును పార్టీలోకి చేర్చుకుని.. టిక్కెట్ ఇవ్వక తప్పని సరి పరిస్థితిలోకి వచ్చింది టీడీపీ. ఇంత చేస్తున్నా.. బీజేపీ మాత్రం తాను అనుకున్న వ్యవహరాలను తానిష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్లిపోతోందనే చర్చ పొలిటికల్ సర్కిల్సులో విపరీతంగా వినిపిస్తోంది.

చంద్రబాబు వ్యతిరేకులను ఏరి కొరి పదవులు ఇస్తున్నారని బీజేపీ గురించి ఏపీ పొలిటికల్ సర్కిల్సులో హాట్ డిస్కషనుగా ఉంది. రఘు రామకృష్ణం రాజును కాదని.. నరసాపురం టిక్కెట్టును శ్రీనివాస వర్మకు కేటాయించారు. అక్కడితో ఆగకుండా సదురు వర్మకు కేంద్ర మంత్రి పదవి కేటాయించారు. అలాగే చంద్రబాబుతో చెడుగుడు ఆడుకున్న సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ టిక్కెట్ కేటాయించారు. ఇప్పుడు సోము సన్నిహితుడు.. చంద్రబాబు వ్యతిరేకిగా ముద్ర వేయించుకున్న పాకా సత్యనారాయణకు టిక్కెట్ కేటాయించారు. ఇది సహజంగానే టీడీపీని ఇబ్బందుల్లోకి నెట్టే వ్యవహరం.. చికాకు పరిచే వ్యవహరంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనేది పొలిటికల్ సర్కిల్సులో హాట్ డిస్కషనుగా ఉంది. తమకిష్టం లేని వ్యక్తులకు పదవులు కట్టబెడుతున్నా.. వారిని వద్దు అని గట్టిగా చెప్పలేని పరిస్థితుల్లో టీడీపీ-జనసేన పార్టీలు ఉన్నాయి. బీజేపీని కాదంటే.. ఏం తేడా వస్తుందో.. ఎందుకొచ్చిన గొడవ అని ఇటు చంద్రబాబు.. అటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ బీజేపీ విషయంలో రాజీ పడక తప్డం లేదనే చర్చ జరుగుతోంది. ఓ విధంగా చెప్పాలంటే.. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు బీజేపీనే హైకమాండ్ అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్సులో వినిపిస్తోంది.

పవన్ ప్రభావం చూపించగలుగుతున్నారా..?

పార్టీని గాడిలో పెట్టగలిగే స్థాయిలో పవన్ పని చేస్తున్నారా..?
కేడర్లో జోష్ నింపే ప్రయత్నాల్లో పవన్ ఎంత వరకు సక్సెస్ అవుతున్నారు..?

తాను స్థాపించిన పార్టీని ఓ కొలిక్కి తీసుకురావడానికి.. అధికారంలోకి తేవడానికి పవన్ కళ్యాణ్ పదేళ్లు పట్టింది. అది కూడా తెలుగుదేశం, బీజేపీతో కలిసి పోటీ చేస్తేనే అది సాధ్యమైంది. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోటీ చేసినా.. సరైన ఓట్లు రాలేదు.. సీట్లు కూడా రాలేదు. స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే.. ఆ రెండు చోట్లా ఓడిపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ చొరవతో కొంత.. రాజీతో కొంత అన్నట్టుగా కూటమి ఏర్పిడింది. 21 స్థానాల్లో పోటీ చేసి.. 21 స్థానాల్లోనూ గెలుపొందిన పరిస్థితి. ఇదో రకంగా సంచలనమే. 2024 ఎన్నికల్లో 21 స్థానాలను గెలిచారు. తాను కాకుండా.. మరో ఇద్దరికి మంత్రి పదవి ఇప్పించారు. ఇప్పటి వరకు ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు వచ్చేలా చేశారు. ఇక నామినేటెడ్ పోస్టుల్లోనూ జనసేన ముఖ్య నేతలకు.. ప్రయార్టీ ఇవ్వాల్సిన వారికి పదవులు కట్టబెడుతూనే ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. కానీ పార్టీ పటిష్టత గురించి.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం గురించి పవన్ కళ్యాణ్ ఎంత వరకు ఆలోచన చేస్తున్నారు.. దానికి సంబంధించిన ప్రణాళికలేమైనా ఉన్నాయా.. అంటే మాత్రం లేదనే సమాధానమే వస్తుంది.

టీడీపీ సంస్థాగతంగా బలోపేతమైన పార్టీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో కూడా పార్టీ కోసం పని చేసే వారు ఏర్పడ్డారు. ఇక బీజేపీ విషయానికొస్తే.. ఆ పార్టీకి కూడా సంస్థాగతంగా నెట్ వర్క్ ఉంది. అయితే జనసేన విషయానికొచ్చేసరికే ప్రధాన పార్టీలకున్న స్థాయిలో నెట్ వర్క్ జనసేనకు పెద్దగా ఉండడం లేదనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చాలా గ్రామాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే పార్టీకి కేరాఫ్ అడ్రస్సుగా ఉంటున్న పరిస్థితి. ఓ కులం ఆధారంగా పార్టీని బిల్డప్ చేయడం చాలా కష్టసాధ్యమైన పని స్వయంగా పవన్ కళ్యాణుకు తెలిసినా.. ఎందుకో పార్టీ

బలోపేతం మీద ఫోకస్ పెడుతున్నట్టు కన్పించడం లేదు. ఒక్కసారి వ్యవస్థను ఏర్పాటు చేస్తే చాలు.. ఆ తర్వాత ఆ వ్యవస్థ పార్టీని ముందుకు నడిపిస్తాయి. కానీ ఇప్పటి వరకు జనసేన అగ్ర నేతలు కానీ.. ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కానీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే అంశంపై ఫోకస్ పెడుతున్న పరిస్థితి కన్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పార్టీలోని ముఖ్య నేతల్లో కొందరికి నామినేటెడ్ పదవులు ఇప్పించినంత మాత్రాన సరిపోదని.. జనసేన పార్టీకి పూర్తి స్థాయిలో పొలిటికల్ లుక్ రావాలంటే మరింత ప్రణాళికాబద్దంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ఇక ఇప్పటికీ జనసేన అంటే కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాల పార్టీగానే కన్పిస్తోంది తప్ప.. గోదావరి గట్టు దాటి మాత్రం ముందుకు రాలేకపోతోంది జనసేన. గడచిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఉమ్మడి శ్రీకాకుళం, చిత్తూరు, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కో స్థానం వచ్చినా.. ఆ సమయంలో వైసీపీ మీదున్న వ్యతిరేకత వల్ల జనసేన అభ్యర్థులు గెలిచారే తప్ప.. వారి సొంత ఛరిష్మానో.. పార్టీ ఫ్లేవర్ వల్లో గెలవలేదు. అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పార్టీని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా పవన్ కళ్యాణ్ చాలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే గిరిజన ప్రాంతాల్లోని సమస్యలను పదే పదే ప్రస్తావించడం ద్వారా.. ఆయా నియోజకవర్గాల్లో తరుచూ పర్యటించడం ద్వారా పవన్ కళ్యాణ్ కొద్దిగా ఎస్టీ నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నా.. ఎన్నికల నాటికి ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. కాబట్టి గ్రామస్థాయిలో పార్టీకి ఓ మనిషంటూ ఉండాలి.. పార్టీ జెండాను భుజాన వేసుకునే వ్యక్తులు ప్రతి కుగ్రామంలోనూ కనీసం పది మందైనా ఉండాల్సిన అవసరం ఉంది. అప్పుడే పార్టీ గ్రామస్థాయిలో బలోపేతం కాగలదు. కానీ ప్రస్తుతం ఆ దిశగా జనసేన అడుగులు వేస్తున్నట్టు ఎంత మాత్రమూ కన్పించడం లేదు.

ప్రతి ఏడాది పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం.. లేదా ప్లీనరీలు చేసుకోవడంతో పాటు.. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం.. సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం వంటి అంశాలపై పవన్ కళ్యాణ్ సహా పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టకుంటే.. 100 శాతం స్ట్రైక్ రేట్ వచ్చినా.. 200 శాతం స్ట్రైక్

రేట్ వచ్చినా నిలబడదని అంటున్నారు. మరి ఈ దిశగా ప్రస్తుతానికైతే జనసేన అడుగులు పడుతున్నట్టు కన్పించడం లేదు. గాలికి గెలిచేశారని గేలి కాకుండా ఉండాలంటే.. ఈదురు గాలులకు చెక్కు చెదరనంతగా.. అంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పార్టీ అన్నింటిని తట్టుకుని నిలబడే స్థాయిలో బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనేది పొలిటికల్ పండిట్స్ భావన.

పాపం పురందేశ్వరి..

ఏపీ బీజేపీకి నామ్ కే వాస్తే అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ తనయ..
హైకమాండ్ వద్ద పురందేశ్వరికి తగ్గిన ప్రాధాన్యం..
పురందేశ్వరి వ్యతిరేకులకు పార్టీలో పెద్ద పీట..

ఏపీ బీజేపీలో జరుగుతున్న కోల్డ్ వార్ ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. కమలం పార్టీకి ఏపీలో చీఫ్ గా ఉన్న పురందేశ్వరిని ఇంటి పోరు పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతోంది. తన ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటున్న దగ్గుపాటి పురందేశ్వరికి.. తాను అధ్యక్షురాలిగా ఉన్న పార్టీని లీడ్ చేయడం మాత్రం నానా ఇబ్బందిగా మారింది. ఎన్నికలకు ముందు తాను కోరుకున్న.. సిఫార్సు చేసిన అభ్యర్థులు అందరికీ చోటు కల్పించలేకపోయారు. ఆ తర్వాత పార్టీలోని పురందేశ్వరి వ్యతిరేకులకు నామినేటెడ్ పదవుల్లో పెద్ద పీట వేస్తోంది బీజేపీ హైకమాండ్. ఈ వ్యవహరం అంతా చూస్తున్న వారికి బీజేపీ అధిష్టానం వద్ద పురందేశ్వరి ప్రాబల్యం అంతంత మాత్రమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నరసాపురం ఎంపీ టిక్కెట్టును రఘు రామకృష్ణం రాజుకు ఇప్పించాలని పురందేశ్వరి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆమె పాచిక పారలేదు.. ఆయన స్థానంలో శ్రీనివాస వర్మకు టిక్కెట్ కేటాయించారు. ఆ తర్వాత పురందేశ్వరికి కెబినెట్లో చోటు దక్కుతుందని అంతా భావించినా.. ఆమెను పక్కకు నెట్టి శ్రీనివాస వర్మకు కెబినెట్లో చోటు కల్పించింది పార్టీ హైకమాండ్. అలాగే ఆ తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ, రాజ్యసభల్లో కూడా ఆమె వేరే వారిని ప్రతిపాదించినా.. వారి మాటలను బేఖాతరు చేస్తూ.. ఎవ్వరూ ఊహించని విధంగా సోము వీర్రాజును ఎమ్మెల్సీ పదవికి.. పాకా సత్యనారాయణను రాజ్య సభకు ఎంపిక చేశారు కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు. ఇది ఓ రకంగా పురందేశ్వరికి షాక్ ఇచ్చినట్టేనని చెప్పాలి.

ఎన్నికల ముందు నుంచి పురందేశ్వరికి నెమ్మదిగా ప్రాధాన్యం తగ్గుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సోము వీర్రాజుకు టిక్కెట్ ఇవ్వడమే కాకుండా.. సోము వీర్రాజు కోసం బీ-ఫారంను ఎయిర్ పోర్టులో పంపడం.. సోము వీర్రాజుకు అనుంగు అనుచరులుగా ముద్ర వేయించుకున్న సోము వీర్రాజు, పాక సత్యనారాయణ వంటి వారికి టిక్కెట్లు కేటాయించడం వంటి నిర్ణయాలు తీసుకోవడం చూస్తుంటే.. కీలక నిర్ణయాల్లో.. తమ మాట నెగ్గించుకునే అంశాల్లో పురందేశ్వరి మాట కంటే.. సోము వీర్రాజుకే అర్హత ఏపీ బీజేపీలో కీలకమైన మార్పులు, చేర్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కన్పిస్తున్నాయనేది ఏపీ బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

కంచి కామకోటి పీఠం ఉత్తర పిఠాధిపతిగా ఏపీ వేద పండితుడు.

అన్నవరానికి చెందిన గణేశ్ శర్మకు కంచి పీఠం పిఠాధిపతిగా అవకాశం.
సన్యాస స్వీకరణ, నామకరణ మహోత్సవానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా పయ్యావుల కేశవ్.

కంచి కామకోటి పీఠం పిఠాధిపతిగా ఏపీకి చెందిన సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య వ్యవహరించనున్నారు. ఏపీకి చెందిన అన్నవరం పుణ్యక్షేత్రానికి చెందిన గణేశ్ శర్మ 71వ కంచికామకోటి పీఠం ఉత్తర పిఠాధిపతిగా వ్యవహరించనున్నారు. ఏప్రిల్ 30వ తేదీన సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య సన్యాస స్వీకరణ, నామకరణ మహోత్సవం నిర్వహించనున్నారు. కంచికామకోటి పీఠం శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి మహా స్వామిజీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది. ఈ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అతిథిగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హజరయ్యారు. అలాగే టీటీడీ నుంచి ఛైర్మన్ బీఆర్ నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హజరయ్యారు.